
రైతును కాటేసిన రాత్రి కరెంట్
కోసిగి: వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం రాత్రి వేళ విద్యుత్ సరఫరా ఇస్తుండటంతో రైతు ప్రాణం కోల్పోయాడు. పగటి సమయంలో విద్యుత్ సరఫరా ఉంటే ఇంటి పెద్ద బతికి ఉండేవాడని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అయ్యారు. కోసిగి మండలం చింతకుంట గ్రామానికి చెందిన బాపుల దొడ్డి మునిస్వామి(63) పొలంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు... మునిస్వామికి మూడు ఎకరాల పొలం ఉంది. ఇటీవల వేరుశనగ పంట సాగు చేశాడు. పొలంలోని వ్యవసాయ బోరులో నీరు అడుగంటడంతో శనివారం అదనంగా పైపులైన్లు వేశారు. తెల్లవారుజామున 3గంటలకు విద్యుత్ సరఫరా ఇస్తున్నారు. పైరుకు నీళ్ల పెట్టాలని తన చిన్న కుమారుడు నల్లారెడ్డితో కలిసి బాపుల దొడ్డి మునిస్వామి పొలానికి వెళ్లాడు. పైరుకు నీళ్లు కట్టే పనిలో కుమారుడు నిమగ్నమై ఉన్నాడు. కొత్తగా పైప్‌లైన్ దింపిన బోరు నుంచి నీళ్లు వస్తున్నాయా లేదా అని మునిస్వామి పరిశీలిస్తున్నాడు. పైప్‌లైన్ పట్టుకోగా విద్యుత్ ఎర్తింగ్ కావడంతో షాక్‌కు గురై అక్కడే కుప్పకూలిపోయాడు. కుమారుడు గమనించి తండ్రిని లేపే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. ప్రైవేట్ వాహనంలో కోసిగి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతినికి భార్య పార్వతి, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రాత్రి వేళ విద్యుత్ సరఫరా ఇవ్వడంతోనే మునిస్వామి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యుదాఘాతంతో అన్నదాత మృతి

రైతును కాటేసిన రాత్రి కరెంట్