
రాష్ట్రంలో అరాచక పాలన!
కర్నూలు (టౌన్): రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి విడుదల రజనీపై పోలీసులు చేసిన దాష్టీకాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. సీఐ సుబ్బరాయుడిపై పోలీసు ఉన్నతాధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్‌లో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్వీ మాట్లాడుతూ... రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ నేతలను టార్గెట్ చేసుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఎంపీటీసీ సభ్యురాలు కల్పన విషయంలోను పోలీసులు దురుసుగా ప్రవర్తించారన్నారు. మహిళ అని చూడకుండా రాత్రి పోలీసు స్టేషన్‌కు ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సీనియర్ మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట కేశవ రెడ్డి విషయంలోను పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరించారన్నారు.
పవన్‌కళ్యాణ్ ఎక్కడ?
ఎన్నికల ముందు 30 వేల మంది మహిళలు కనిపించడంలేదంటూ ఊగి..ఊగి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు సభల్లో మాట్లాడారని ఎస్వీ గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఒక్క మహిళనైనా తీసుకువచ్చారా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కాలం అవుతుందని, ఇప్పటి వరకు సూపర్ సిక్స్ పథకాల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన పథకాలు అమలు చేయడం చేతకాక ప్రశ్నించే వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారన్నారు. సినీ నటుడు పోసాని మురళిపై అక్రమంగా 16 కేసులు నమోదు చేశారన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు విసుగు చెందారని..వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. తప్పు చేసిన పోలీసులకు శంకరగిరి మాన్యాలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి షరీఫ్, బీసీ సెల్ అధ్యక్షులు రాఘవేంద్ర నాయుడు, కల్లా నరసింహారెడ్డి, ధనుంజయ ఆచారీ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి విడుదల రజనీపై
పోలీసుల దాష్టీకం
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ఎస్వీ మోహన్ రెడ్డి