
విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం పెంచాలి
డోన్ టౌన్: విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం పెంచాలని జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు, మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. పట్టణంలోని శ్రీసుధ సీబీఎస్సీ సిలబస్ స్కూల్లో ఆదివారం నిర్వహించిన జన విజ్ఞాన ప్రాంతీయ ఉమ్మడి జిల్లాల వేదిక వర్క్‌షాప్‌నకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో అభివృద్ధితో పాటు సైన్స్ ఆలోచనలు పెరగాలని, శాస్త్ర పరిశోధనలకు మనం ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పారు. పిల్లల్లో ప్రశ్నించే తత్వం పెరగాలన్నారు. జన విజ్ఞాన వేదిక ప్రజల ప్రగతి కోసం, స్వావలంబన కోసం, దేశ అభివృద్ధి కోసం, సామాజిక విప్లవం కోసం పని చేస్తుందన్నారు. జేవీవీ కార్యకర్తలు సైతం ఆ దిశగా పనిచేయాలన్నారు. జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ గేయానంద్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి పెంపొందించాలని చెప్పారు. శాసీ్త్రయ దృక్పథం పెంచేందుకు విరివిగా కళా జాతలు, చెకుముకి టాలెంట్ టెస్ట్‌లు, సైన్స్‌ఫేర్‌లు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో జేవీవీ జిల్లా అధ్యక్షుడు నాగరాజు, ప్రధాన కార్యదర్శి మాణిక్యం శెట్టి, రాష్ట్ర కార్యదర్శి తవ్వా సురేష్, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రంగన్న, నాయకులు భాస్కర్, కర్నూలు, అనంతపురం ఉమ్మడి నాలుగు జిల్లాల ప్రధాన కార్యదర్శులు రామిరెడ్డి, లక్ష్మీనారాయణ, ఆదేశేషు, మహేందర్‌రెడ్డి, ఖాజా హుస్సేన్, సుధీర్, జేవీవీ సమతా నాయకులు పాల్గొన్నారు.