
మనం బాగుంటే చాలు.. అవతల ఎవరేమైపోతేనేం అనుకునే రోజులివి.
తుగ్గలి: ఆపరేషన్ సింధూర్. దేశమంతటినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చిన పదం. ఉగ్రమూకలు చెలరేగుతున్న వేళ.. అమాయకులను పొట్టున పెట్టుకుంటున్న తరుణంలో సైన్యం ఎక్కుపెట్టిన తుపాకీ ప్రతి ఒక్కరిలో దేశభక్తిని రగిల్చింది. మనమంతా గుండెల మీద చేయి వేసుకుని హాయిగా నిద్రపోతున్నామంటే.. సరిహద్దులో సైనికులు నిద్రలేని రాత్రులు గడుపుతుండటంతోనే సాధ్యమవుతోంది. అక్కడ ఏం జరుగుతుందో.. వాళ్లు ఎలా ఉంటున్నారో.. ఆ కుటుంబాల పరిస్థితి ఏమిటో.. కదనరంగం దృశ్యాలను చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. బుల్లెట్ల మోత.. విరుచుకుపడే మిసైళ్లు.. దూసుకొచ్చే డ్రోన్లు.. అత్యాధునిక ఆయుధాలకు ఎదురొడ్డి నిలుస్తున్న సైనికులను చూస్తే కన్నీళ్లతో సెల్యూట్ చేయాలనిపిస్తోంది. సరిహద్దులో ఉద్రిక్తతల వేళ అమినాబాద్ గ్రామం నిద్రలేని రాత్రులను గడుపుతోంది. ఇందుకు కారణం ఆ చిన్న గ్రామం నుంచి ప్రస్తుతం 15 మంది దాకా ఆర్టీలో పని చేస్తుండటమే. ఈ గ్రామంలో ఇప్పుడు ఎవరిని పలుకరించినా మా పిల్లలు సైన్యంలో ఉండటం తమకెంతో గర్వకారణం అనడం ఎంతో స్ఫూర్తినిస్తోంది. తుగ్గలి మండలంలోని గిరిగెట్ల పంచాయతీ మజరా గ్రామమైన అమినాబాద్‌లో 201 కుటుంబాలు ఉండగా.. 873 మంది జనాభా ఉన్నారు. గత 30 ఏళ్లలో 25 మంది ఆర్మీలో చేరారు. యువకులే కాకుండా యువతులు మేము సైతమని దేశసేవకు తమ జీవితాలను అంకితం చేస్తుండటం విశేషం. ఒకరి నుంచి మరొకరు స్ఫూర్తి పొందుతూ గ్రామం తలెత్తుకునేలా సైన్యంలో సేవలందిస్తుండటం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం.
దేశభక్తికి మారుపేరు
కుటుంబాలకు దూరంగా సైన్యంలో సేవలు ప్రస్తుతం వివిధ విభాగాల్లో 15 మంది
మేముసైతం అని ఇద్దరు యువతులు గర్వంగా ఉందంటున్న సైనిక కుటుంబాలు
ఇప్పటికై నా యుద్ధానికి సిద్ధమంటున్న మాజీలు