
యుద్ధ సమయంలో అండగా ఉంటాం
నిజమైన హీరో మురళీనాయక్
కర్నూలు(అగ్రికల్చర్): పాకిస్తాన్‌తో పోరాడుతూ అమరుడైన మురళీనాయక్‌ను తెలుగు రాష్ట్రాలు ఎన్నటికీ మరచిపోలేవని కర్నూలు విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రంగారెడ్డి తెలిపారు. శనివారం కర్నూలు అబ్బాస్ నగర్‌లోని కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆర్మీ జవాన్ మృతికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. యుద్ధంలో అసువులు బాసిన ఆర్మీజవాన్ ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిముషాలు మౌనం పాటించారు. దేశ రక్షణకు అమరుడైన శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్ ప్రజలందరి దృష్టిలో నిజమైన హీరో అంటూ శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో పలువురు విశ్రాంత ఉద్యోగుల సంఘం నేతలు పాల్గొన్నారు.
పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి అత్యంత దారుణం. దీనికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్‌లో ఉగ్రస్థావరాలను నిర్మూలించేందుకు భారత్ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. యుద్ధ సమయంలో దేశానికి అండగా ఉంటాం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 7 వేలకుపైగా మాజీ సైనికులు ఉన్నాం. ఐదేళ్లలోపు పదవీ విరమణ పొందిన వారి వివరాలను డిఫెన్స్ అధికారులు అడిగారు. 60 ఏళ్లలోపు వయస్సు ఉన్న మాజీ సైనికులు దేశం కోసం పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాం. – నర్రా పేరయ్య చౌదరి,
జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు, కర్నూలు