జల్సాల కోసం బైకుల చోరీ | - | Sakshi
Sakshi News home page

జల్సాల కోసం బైకుల చోరీ

May 10 2025 8:14 AM | Updated on May 10 2025 8:14 AM

జల్సాల కోసం బైకుల చోరీ

జల్సాల కోసం బైకుల చోరీ

కర్నూలు: మద్యం, గంజాయి, జల్సాలకు అలవాటు పడి వచ్చే ఆదాయం చాలక సులువుగా డబ్బులు సంపాదించే మార్గాన్ని ఆ యువకులు అన్వేషించారు. కర్నూలులోని ఠాగూర్‌నగర్‌కు చెందిన రమేష్‌ బాబు, టెలికాం నగర్‌కు చెందిన తెలుగు కళ్యాణ్‌, గణేష్‌ నగర్‌కు చెందిన పిక్కిలి పెద్దిరాజు, షేక్‌ ఖాజా మొహిద్దిన్‌, కర్నూలు మండలం నిడ్జూరు గ్రామానికి చెందిన అనిల్‌ కుమార్‌ యాదవ్‌ జట్టుగా ఏర్పడి ద్విచక్ర వాహనాల చోరీలను ఎంచుకున్నారు. కర్నూలు నగరంతో పాటు హైదరాబాదు, గద్వాల, జడ్చర్ల, కొత్తకోట, ఉప్పల్‌, ఖైరతాబాద్‌ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను చోరీ చేశారు. దాదాపు ఐదు నెలలుగా సాగుతున్న వారి చోరీల పర్వానికి మూడో పట్టణ పోలీసులు చెక్‌ పెట్టారు. పక్కా ఆధారాలతో నిఘా పెట్టి వారి నుంచి రూ.5 లక్షల విలువైన ద్విచక్ర వాహనాలను రికవరీ చేశారు. కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్‌, మూడో పట్టణ సీఐ శేషయ్యతో కలసి శుక్రవారం సాయంత్రం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో వివరాలను వెల్లడించారు. కర్నూలుకు చెందిన ముగ్గురు, నిడ్జూరుకు చెందిన అనిల్‌ కుమార్‌ కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చోరీ చేశారు. బాధితుడు కర్నూలు ఠాగూర్‌నగర్‌కు చెందిన రమేష్‌ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పక్కా ఆధారాలతో ముందుగా ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాల చిట్టా బయటపడింది. ముందు వాహనంపై కన్నేస్తారు, ఎంచక్కా పట్టేస్తారు, గుట్టుగా దాటిస్తారు, లోగుట్టుగా అమ్మేస్తారు. ఐదు నెలల వ్యవధిలో సుమారు 15 వాహనాలు చోరీ చేసి తుగ్గలి మండలం ముక్కెళ్ల గ్రామంలో 11, గడివేముల మండలం గని గ్రామంలో నాలుగు వాహనాలను విక్రయించి వచ్చిన సొమ్ముతో దర్జాగా జల్సా చేశారు.

వెలుగు చూసిందిలా...

కర్నూలు ఠాగూర్‌నగర్‌కు చెందిన రమేష్‌ బాబు ప్రభుత్వాసుపత్రిలో పని మీద వచ్చి ద్విచక్ర వాహనం పార్క్‌ చేసి లోపలికి వెళ్లి వచ్చేసరికి మాయమయ్యింది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిఘా పెంచారు. తరచూ ద్విచక్ర వాహనాలు మారుస్తూ తిరిగేవారిపై కన్నేశారు. కర్నూలులోని మద్దూర్‌ నగర్‌లో కూడా ఓ వాహనం చోరీ అయినట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్కడ సీసీ ఫుటేజీని పరిశీలించి ఇద్దరు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా వారి నేరాల చిట్టా మొత్తం బయటపడింది. వారి నుంచి 15 వాహనాలను రికవరీ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు.

మాయాబేరం...

వాహనం కండిషన్‌లో ఉండి.. రూ.2 లక్షలు విలువ చేసే బుల్లెట్‌ వాహనం రూ.15 వేలకే ఇస్తాం. లక్షన్నర విలువ చేసే బజాజ్‌ పల్సన్‌ వాహనం రూ.10 వేలకే ఇస్తామంటూ గ్రామీణ ప్రాంతాల యువకులను మాటల్లోకి దింపి దొంగ వాహనాలను అమ్మి వచ్చిన కాసులతో జల్సా చేశారు. నలుగురు దొంగలను రిమాండ్‌కు పంపినట్లు డీఎస్పీ వెల్లడించారు. చోరీ కేసును చాకచక్యంగా ఛేదించి నిందితులను అరెస్టు చేయడమే కాక భారీ ఎత్తున వాహనాలను రికవరీ చేసినందుకు క్రైం పార్టీ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

నలుగురు దొంగలను

అరెస్ట్‌ చేసిన పోలీసులు

15 బైకుల రికవరీ

వివరాలు వెల్లడించిన డీఎస్పీ

రద్దీ ప్రాంతాలను ఎంచుకుని చోరీలు...

ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలపై కన్నేసి వాహ నాలు ఆపే వ్యాపార సముదాయాల్లోకి ఎవరైనా వెళ్లగానే పని మొదలుపెడతారు. అప్పటికే సిద్ధంగా ఉన్న మారు తాళాలతో చోరీ చేస్తారు. అక్కడినుంచి గుట్టుగా గ్రామీణ ప్రాంతాలకు తరలించి రహస్య ప్రదేశాల్లో దాచి ఉంచి సెల్‌తో ఫొటో తీసి కావలసిన వారికి వాట్సాప్‌లో పెట్టి కొనేందుకు సిద్ధంగా ఉన్న వ్యక్తులకు విక్రయిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement