
జంట హత్యల కేసులో తుది తీర్పు
● సంచలనం రేపిన చెరుకులపాడు
నారాయణరెడ్డి, సాంబశివుడు
హత్యోదంతాలు
● ఎనిమిదేళ్ల తర్వాత నిందితులకు
యావజ్జీవ శిక్ష
● 11 మందికి శిక్ష ఖరారు,
ఐదుగురు విడుదల
● కుటుంబ సభ్యుల్లో
కట్టలు తెంచుకున్న కన్నీళ్లు
అప్పుడు వాళ్లను ఏడ్పించి..
ఇప్పుడు వీళ్లు ఏడుస్తూ!
(యావజ్జీవ శిక్ష పడటంతో
రోదిస్తున్న ముద్దాయిలు)
ఎవరికోసమైతే ఇద్దరిని చంపారో వాళ్లు కాపాడుతారనుకున్నారు. అడిగినంత డబ్బు ఇచ్చాం కాదా, ఎంచక్కా బయటకు రావచ్చునుకున్నారు. ఎనిమిదేళ్లు ఇలా గడిచిపోయింది.. ఇక కోర్టు మెట్లు ఎక్కే పని లేదనుకున్నారు.. గురువారం ఉదయం జిల్లా కోర్టు వద్ద ఉద్విగ్న వాతావరణం నెలకొంది. జంట హత్యల కేసులో నిందితులుగా ఉన్న వారంతా కోర్టుకు చేరుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసింది. ఎలాంటి తీర్పు వస్తుందోనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో కనిపించింది. 11 గంటల సమయంలో 11 మంది నిందితులకు యావజ్జీవ శిక్ష విధిస్తూ కర్నూలు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టు తీర్పు వెలువరించింది. విషయం క్షణాల్లో బయటకు రావడంతో కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. నెత్తీనోరు కొట్టుకుంటూ, ఇక మాకు దిక్కెవరంటూ రోదిస్తున్న తీరు ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టించింది. ఇదిలా ఉంటే కోర్టు నుంచి బయటకు వచ్చిన ముద్దాయిలు కూడా తమ వాళ్లను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. చంపినప్పుడు ఆ కుటుంబాల్లో ఎంతటి క్షోభకు గురై ఉంటాయో, ఇప్పుడు వారి కుటుంబ సభ్యులను చూసి వాళ్లు కూడా అంతకు రెట్టింపు వేదనను అనుభవించడం కనిపించింది.
– కర్నూలు(సెంట్రల్)/వెల్దుర్తి