
జిల్లా కలెక్టర్‌కు రెడ్‌క్రాస్ అవార్డు
కర్నూలు(సెంట్రల్): బాపట్ల, కర్నూలు జిల్లాల్లో రెడ్ క్రాస్ సొసైటీల ద్వారా 2023–24, 2024–25 సంవత్సరాల్లో అత్యుత్తమ సేవలందించిన అందించిన జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా రెడ్ క్రాస్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ క్రమంలో గురువారం విజయవాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్ నుంచి కలెక్టర్ అవార్డును అందుకున్నారు. అత్యుత్తమ సేవలకు లభించిన అవార్డును గౌరవంగా భావిస్తానని, మున్ముందు రెడ్‌క్రాస్ ద్వారా అందే సేవలను మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు.
జిల్లాలో 8,500 ఫాంపాండ్స్
కర్నూలు(అగ్రికల్చర్): జూన్ నెల చివరిలోగా జిల్లాలో 8,500 ఫాంపాండ్స్ నిర్మించనున్నామని జిల్లా నీటి యాజమాన్య సంస్ధ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటరమణయ్య తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... జిల్లాలో 7,000 మంది రైతులను గుర్తించామని, వీరి పొలాల్లో 2,500 ఫాంపాండ్స్ పనులు మొదలయ్యాయన్నారు. వీటిలో 800 పూర్తి చేశామని, 1,600 పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ఫాంపాండ్స్‌తో ఉపాధి కూలీలకు 12 లక్షల పని దినాలు లభిస్తాయని, రూ.36.84 కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు.
సిల్వర్ సెట్ గడువు పొడిగింపు
కర్నూలు సిటీ: సిల్వర్‌జూబ్లీ డిగ్రీ కాలేజీలో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న సిల్వర్ సెట్ గడువు పెంచినట్లు క్లస్టర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్‌కట్టా వెంకటేశ్వర్లు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సెట్ దరఖాస్తుకు గత నెల 30 వరకు గడువు ఉండేదని, దానిని ఈ నెల 15వ తేదీ వరకు పెంచామని తెలిపారు. ఈ నెల 18న అర్హత పరీక్ష నిర్వహించాల్సి ఉండేదని, అయితే దానిని ఈ నెల 29వ తేదీన నిర్వహిస్తామని పేర్కొన్నారు. కాలేజీలో మొత్తం 280 సీట్లు అందుబాటులో ఉన్నాయని, మరి కొంత మంది విద్యార్థులకు అవకాశం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ
కర్నూలు(సెంట్రల్): కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు డీఎస్‌ఓ ఎం.రాజారఘువీర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అయితే దరఖాస్తులను సమీపంలో ఉన్న వార్డు/గ్రామ సచివాలయాల్లో అందించాలని సూచించారు. కొత్త రేషన్ కార్డులతోపాటు పాత కార్డుల్లో సభ్యులు చేర్పులు, మార్పులు, తొలగింపులు, చిరునామాలు, ఆధార్ సీడింగ్ తదితర మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉందన్నారు.
వైద్యులు, సిబ్బంది సెలవులు రద్దు
కర్నూలు (హాస్పిటల్): భారత్ , పాక్ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు అత్యవసర సమయంలో వైద్యసేవల పరంగా చికిత్స అందించేందుకు గాను కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని వైద్యులు, సిబ్బంది సెలవులు రద్దు చేసినట్లు ఆసుపత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరాములు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవసర సమయంలో రోగులకు ఎలా వైద్యాన్ని అందించాలన్న విషయాన్ని గుర్తుంచుకుని ఆసుపత్రుల్లో ఆక్సిజన్, మందులు, వెంటిలేటర్లు అందుబాటులో ఉంచుకుని సేవలు అందించాలని సూచించారు.
వెబ్‌సైట్‌లో ‘పది’
మార్కుల జాబితాలు
కర్నూలు సిటీ: పదో తరగతి విద్యార్థుల మార్కుల జాబితాలు www.bse.ap.gov.in అనే వెబ్‌సైట్‌లో ఉన్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ చంద్ర భూషణం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా స్కూళ్లకు చెందిన ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలల లాగిన్ ఆధారాలను ఉపయోగించి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయులు సంతకాలు చేసి వాటిని విద్యార్థులకు అందజేయవచ్చు తెలిపారు. ఏవైనా తప్పులు ఉంటే సరి చేసేందుకు ఈ నెల25లోపు విజయవాడలోని పరీక్షల విభాగం డైరెక్టరేట్ దృష్టికి తీసుకపోవాలని పేర్కొన్నారు.