
సారా జోలికి వెళ్లొద్దు
నందికొట్కూరు: నాటు సారా తయారు చేయడం, విక్రయించడం నేరమని, వాటి జోలికి వెళ్లి జైలుపాలు కావద్దని నంద్యాల అసిస్టెంట్ ప్రొహిబిషన్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ వి. రాముడు హెచ్చరించారు. మంగళవారం పట్టణంలోని అల్వాల కళ్యాణ మండపంలో నవోదయం కార్యక్రమంలో భాగంగా కిరాణ వ్యాపారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని వ్యాపారులందరూ సారా తయారు చేసే వారికి బెల్లం విక్రయించొద్దంటూ సూచించారు. కోళ్లబావాపురం, పట్టణంలోని నీలిషికారిపేటకు చెందిన ప్రజలకు బెల్లం అమ్మకంలో నియంత్రణ పాటించాలన్నారు. నాటుసారా తయారీ చేయడానికి బెల్లం వనరుగా మారిందని గుర్తు చేశారు. ఆయా ప్రాంతాల్లో సారా తయారు చేసి విచ్ఛలవిడిగా ఇతర గ్రామాలకు సరఫరా చేస్తున్నారని, ఈ మేరకు కట్టడికి చర్యలు చేపట్టామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నాటు సారా బెల్లం అమ్మితే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కిరాణం దుకాణాల అసోసియేషన్ అధ్యక్షుడు వజీర్‌బాషా, గౌరవ అధ్యక్షులు నగేష్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి సతీష్‌కుమార్, టౌన్ సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎకై ్సజ్ శాఖ సీఐ రామాంజనేయులు నాయక్, ఎస్‌ఐలు జప్రూల్లా, శ్రీనివాసులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.