
జ్వాలాపురం సందర్శించిన అధికారులు
బనగానపల్లె రూరల్: మండలంలోని జ్వాలాపురం గ్రామ సమీపంలో ఉన్న కొండలను నంద్యాల ఆర్డీఓ నరసింహులు, అనంతపురం, కర్నూలు పురావస్తు శాఖ ఏడీ డాక్టర్ వి రజిత, జిల్లా పర్యాటకశాఖ అధికారి సత్యనారాయణ, డీపీఓ శివారెడ్డి తదితరులు శుక్రవారం సందర్శించారు. 74 వేల ఏళ్ల క్రితం ఇండోనేషియా దేశంలోని సుమత్రా దీవిలో తోబా అగ్నిపర్వతం మహా విస్పోటనం చెందడంతో ఎగసి పడిన బూడిద గ్రామ పరిసర ప్రాంతాల్లో పడినట్లు పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించడం తెలిసిందే. ఇక్కడి భూమిలో వ్యవసాయ పంటలు పండించుకోవడంతో పాటు మైనింగ్ కార్యకలాపాల వల్ల బూడిద ఆనవాళ్లు చెదిరిపోయే ప్రమాదముందని, మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉండటంతో భూ పొరలను, మట్టిని, నేలను ధ్వంసం చేయకూడదని అధికారులు గ్రామస్తులకు సూచించారు. ఈ ప్రాంతాన్ని జ్వాలాపురం సర్క్యూట్‌గా అభివృద్ధి చేయడంతో పాటు సమీపంలోనే దద్దణాల ప్రాజెక్టు ఉండడంతో టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదించనున్నామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ నారాయణరెడ్డి, ఎంపీడీఓ వెంకటరమణ, అసిస్టెంట్ జియాలజిస్టు రవికుమార్, భూగర్భ గనుల శాఖ టెక్నికల్ అసిస్టెంట్ పద్మ, ఈఓఆర్‌డీ సతీష్‌కుమార్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శకుంతల, వీఆర్‌ఓ గోవిందప్ప పాల్గొన్నారు.