
మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య
గూడూరు: వాల్మీకుల చిరకాల కోరికను నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపేందుకు ఆదివారం కర్నూలులో మహా ప్రదర్శన, భారీ సభను నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య తెలిపారు. ఈ కార్యక్రమానికి కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచి బోయ, వాల్మీకులు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్‌తో కలిసి వాల్మీకి నాయకులతో గూడూరు పట్టణంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ ఎస్టీ జాబితాలో చేర్చాలని 70 ఏళ్లుగా వాల్మీకులు పోరాటం చేస్తున్నా ఎవరూ పట్టించుకోలేదన్నారు. సీఎం వైఎస్ జగన్ స్పందించి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్‌కు పంపించారన్నారు. జోనల్ వ్యవస్థ ద్వారా ఎవరికీ నష్టం వాటిల్లకుండా సీఎం కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయని మండి పడ్డారు. కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ మాట్లాడుతూ వాల్మీకుల దశాబ్దాల కల నెరవేరుతుంటే టీడీపీ నాయకులకు కడుపు మంటగా ఉందన్నారు. వాల్మీకులు సంఘటితంగా సీఎంకు అండగా నిలవాలని కోరారు. సమావేశంలో గూడూరు మున్సిపల్ చైర్మన్ జులుపాల వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్‌లు పీఎన్ అస్లామ్, బోయ లక్ష్మన్న, సచివాలయ కన్వీనర్ ఎల్.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
భారీగా తరలి రావాలని
బీవై రామయ్య పిలుపు