కర్నూలు: మద్యం తాగొద్దన్నందుకు కర్నూలు ప్రకాష్‌నగర్‌కు చెందిన చాకలి శ్రీనివాసులు (53) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన గత నెల 20వ తేదీన భార్య సావిత్రమ్మతో గొడవ పడి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కనిపించడం లేదని కర్నూలు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాత్రి పొద్దుపోయాక పత్తి పొలంలో నుంచి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాను పురుగుల మందు తాగి చనిపోతున్నానంటూ చెప్పి సెల్ స్విచ్చాఫ్ చేశాడు. కుటుంబ సభ్యులు అతని కోసం కర్నూలు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా కనిపించలేదు. శ్రీనివాసులు, సావిత్రమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు, కూతురు సంతానం కాగా అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. భార్యతో పాటు కుటుంబ సభ్యులంతా వారం రోజులుగా వెతుకుతుండగా మద్యం సేవించేందుకు పొలంలోకి వెళ్లిన స్థానికులు మృతదేహాన్ని చూసి పంచలింగాల తలారి ద్వారా వీఆర్వోకు సమాచారం ఇచ్చారు. ఆయన ఫిర్యాదు మేరకు కర్నూలు అర్బన్ తాలూకా పీఎస్ ఎస్‌ఐ ఎర్రన్న శనివారం సంఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేశారు.
‘‘పక్షవాతం జబ్బుతో బాధ పడుతున్నావు.. మద్యం సేవిస్తే జబ్బు నయం కాదు’’ అంటూ మందలించినందుకే ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎర్రన్న తెలిపారు.