ఎమ్మిగనూరుటౌన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే వాల్మీకులకు న్యాయం జరుగుతోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. శుక్రవారం పట్టణంలో ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ.. రాయలసీమ జిల్లాలోని వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. సీఎంకు ధన్యవాదాలు తెలుపుతూ కర్నూలులో ఏప్రిల్ 2వ తేదీన పెద్ద ఎత్తున ర్యాలీ, బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి వాల్మీకులు భారీగా తరలిరావాలని కోరారు. ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ప్రజలంతా వైఎస్సార్‌సీపీ వైపే ఉన్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో అన్ని ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలను వైఎస్సార్‌సీపీ కై వసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరినా పార్టీకి ఎలాంటి ఢోకా లేదని ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి అన్నారు. టీడీపీలో చేరిన వారు కచ్చితంగా నష్టపోతారన్నారు. విలేకరుల సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహమ్మద్, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు బుట్టారంగయ్య, టౌన్‌బ్యాంక్ చైర్మన్ యూకే రాజశేఖర్, జిల్లా వక్ఫ్‌బోర్డ్ ఉపాధ్యక్షుడు రియాజ్ అహమ్మద్, పార్టీ నాయకులు నాగేష్‌నాయుడు, పేట శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
బీవై రామయ్య