
కర్నూలు(అగ్రికల్చర్): ‘వైఎస్సార్ ఆసరా’ సంబరాలు ఊరూరా ఆనందోత్సవాల మధ్య జరుగుతున్నాయి. వైస్సార్ ఆసరా 3వ విడత నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మార్చి నెల 25న విడుదల చేశారు. మార్చి 26 నుంచి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఆసరా వేడుకలు జరుగుతున్నాయి. శుక్రవారం జిల్లాలోని మూడు మండలాలతో పాటు కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, గూడూరులో సంబరాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. సీఎం వైఎస్ జగన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. థ్యాంక్యూ సీఎం సార్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. గోనెగండ్లలో నిర్వహించిన వేడకల్లో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట కేశవరెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, కర్నూలు మేయర్ బీవై రామయ్య, డీఆర్‌డీఏ–వైకేపీ పీడీ వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు. సంబరాల్లో దాదాపు 4000 మంది మహిళలు పాల్గొన్నారు. 565 సంఘాలకు రూ.3.48 కోట్ల విలువ చేసే మెగా చెక్‌ను అందజేశారు. కోడుమూరులోని ఎల్‌ఎల్‌సీ క్యాంపు ఆఫీసు ప్రాంగణంలో ఆసరా సంబరాలు జరిగాయి. కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ పాల్గొని 824 సంఘాలకు రూ.4.81 కోట్ల విలువ చేసే మెగా చెక్ అందజేశారు. ఈ వేడుకల్లో దాదాపు 3000 మంది మహిళలు పాల్గొన్నారు. ఆలూరు నియోజకవర్గంలోని హాలహర్విలో జరిగిన ఆసరా సంబరాల్లో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం సొదరుడు నారాయణ స్వామి పాల్గొన్నారు. 419 సంఘాలకు రూ.2.70 కోట్ల మెగా చెక్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో దాదాపు 2000 మంది మహిళలు పాల్గొన్నారు. సంబరాల్లో జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
అర్బన్ ప్రాంతాల్లో...
కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో కల్లూరు వార్డులకు సంబంధించి ఆసరా సంబరాలు పెద్ద ఎత్తున జరిగాయి. వేడుకలకు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ రేణుక హాజరయ్యారు. 256 సంఘాలకు రూ. 1.34 కోట్ల విలువ చేసే మెగా చెక్‌ను అందజేశారు. ఆదోని మున్సిపాలిటీలోని శక్తి గుడి దగ్గర ఏర్పాటు చేసిన సంబరాల్లో దాదాపు 3500 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రూ.9.17 కోట్ల విలువ చేసే మెగా చెక్‌ను సంఘాల లీడర్లకు అందజేశారు. ఎమ్మిగనూరు, గూడూరు మున్సిపాలిటీల్లో కూడా ఆసరా సంబరాలు పెద్ద ఎత్తున జరిగాయి.
పొదుపు మహిళలకు
మెగా చెక్కుల అందజేత