
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ పి.కోటేశ్వరరావు
కర్నూలు(సెంట్రల్): జిల్లాలోని అన్ని నియోజకవర్గాల స్కిల్ హబ్‌లు, జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన స్కిల్ కాలేజీలో శిక్షణకు రిజిస్ట్రేషన్‌లు ప్రారంభమైనట్లు కలెక్టర్ పి.కోటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి స్కిల్ డెవలప్‌మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కర్నూలు సిల్వర్ జూబ్లీ డిగ్రీ కాలేజీ, పెద్దకడబూరు మండలం మురవణిలోని గర్‌ల్స్ డిగ్రీ కాలేజీ, ఆదోని న్యాక్ సెంటర్, కర్నూలు న్యాక్ సెంటర్, ఆలూరు గర్‌ల్స్ జూనియర్ కాలేజీ, పత్తికొండ డిగ్రీ కాలేజీ, ఎమ్మిగనూరు గర్‌ల్స్ జూనియర్ కాలేజీలలో స్కిల్ హబ్‌లను ఏర్పాటు చేశామన్నారు. అలాగే కర్నూలులోని టీటీడీసీ డీఆర్‌డీఏ ట్రైనింగ్ సెంరట్‌ను స్కిల్ కాలేజీగా మార్చినట్లు చెప్పారు. ఆయా సెంటర్లలో డిగ్రీ అర్హత ఐటీ, ఐటీ–ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో ఉద్యోగాలు పొందడానికి అవసరమైన నైపుణ్యాలపై శిక్షణ ఇస్తారన్నారు. అలాగే నిర్మాణ రంగంలో ఎలక్ట్రికల్‌కు 10వ తరగతి, ప్లంబింగ్‌కు 8వ తరగతి అర్హతగా నిర్ణయించామన్నారు. కష్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు ఇంటర్ అర్హతతో నాన్ రెసిడెన్షియన్ విధానంలో శిక్షణ పొందవచ్చన్నారు. స్కిల్ కాలేజీలో కెమిస్ట్రీ సబ్జెక్ట్ డిగ్రీ అర్హతతో పేషెంట్ రిలేషన్ సర్వీసు డ్యూటీ మేనేజర్‌గా శిక్షణ తీసుకుంటే పరిశ్రమలు, ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు పొందేందుకు అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ఆర్‌యూ వీసీ అనందరావు, డీఆర్‌డీఏ పీడీ వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.
రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే..
● ఏపీఎస్‌ఎస్‌డీసీ.ఇన్ అనే వెబ్‌సైట్‌లో.. లేదా గూగుల్ ప్లేస్టోర్‌లో ఏపీఎస్‌ఎస్‌డీసీ స్కిల్ హబ్ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
● సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లోని డిజిటల్, ఇంజినీరింగ్ అసిస్టెంట్లతో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
● ఇతర వివరాలకు 9059290821 నంబర్‌ను సంప్రదించవచ్చు.