తాటి ముంజలకు వెళ్లి మృత్యు ఒడికి..

మృతి చెందిన సుశీలమ్మ   - Sakshi

రుద్రవరం: జీవనోపాధిలో భాగంగా తాటి ముంజలు కోసేందుకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తూ మృత్యువాత పడ్డాడు. ముత్తలూరుకు చెందిన చిత్తిగాళ్ల బాల లింగమయ్య(38) శుక్రవారం నర్సాపురం సమీపంలోని తాటి వనంలో ముంజలు కోసేందుకు వెళ్లాడు. అక్కడ చెట్టు పైకి చేరుకొని ముంజలు కోస్తుండగా ప్రమాదవశాత్తూ కాలు జారి కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆళ్లగడ్డ ఆసుప్రతికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య రమణమ్మ, కుమారుడు డేవిడ్‌, కుమార్తె నిరీక్షణ ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి ఘటనాస్థలికి చేరుకొని ప్రమాద వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేశారు.

నిడ్జూరులో యువతి ఆత్మహత్య

కర్నూలు: కర్నూలు మండలం నిడ్జూరు గ్రామంలో తెలుగు లలితమ్మ (16) అనే యువతి శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో పనిచేయాలని తండ్రి చిన్నలాలు మందలించినందుకు క్షణికావేశంలో పడక గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. కుటుంబ సభ్యులు తలుపులు బద్దలుకొట్టి ఉరి నుంచి తప్పించేసరికి ఆమె మృతిచెందింది. విషయం తెలిసిన వెంటనే కర్నూలు అర్బన్‌ తాలూకా పోలీసులు అక్కడికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి తరలించారు. క్షణికావేశంతో లలితమ్మ ఉరి వేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మన్మథ విజయ్‌ తెలిపారు.

ప్రాణం తీసిన

విద్యుదాఘాతం

కొలిమిగుండ్ల: ఇటిక్యాల కోళ్ల ఫారం ఎస్సీ కాలనీలో శుక్రవారం విద్యుదాఘాతంతో ఓ వృద్ధురాలి మృతి చెందింది. కాలనీకి చెందిన సుశీలమ్మ(65) ఇంటి మీదుగా 33/11 కేవీ విద్యుత్‌ లైన్‌ వెళ్లింది. తీగలకు పక్కనే మేడిపండు చెట్టు ఉండటం, కొమ్మలు తగులుతున్నాయని శుక్రవారం మధ్యాహ్నం వాటిని తొలగిస్తుండగా విద్యుదాఘాతానికి గురైంది. కుటుంబ సభ్యులు చికిత్స కోసం కొలిమిగుండ్లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకురాగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

బైక్‌ అదుపు తప్పి వ్యక్తి మృతి

పాములపాడు: కర్నూలు – గుంటూరు రహదారిపై కంబాలపల్లి గ్రామం వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. వేంపెంట గ్రామానికి చెందిన బోనాల రవి (36)కి నాలుగేళ్ల క్రితం కర్నూలుకు చెందిన సంధ్యారాణితో వివాహమైంది. కాగా రెండు నెలల క్రితం మనస్పర్ధలతో సంధ్యారాణి పుట్టింటికి వెళ్లింది. భార్యను పిలుచుకువస్తానని ఇంట్లో తల్లికి చెప్పి బైక్‌పై కర్నూలుకు బయల్దేరాడు. కాగా కంబాలపల్లి గ్రామం వద్ద అదుపు తప్పి పక్కనే ఉన్న బోర్డును ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని 108లో ఆత్మకూరు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Read latest Kurnool News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top