
ఏర్పాట్లపై సూచనలిస్తున్న బీవై రామయ్య
కర్నూలు(అర్బన్): నగరంలో ఏప్రిల్ 2వ తేదీన నిర్వహించనున్న వాల్మీకుల సభకు కావాల్సిన ఏర్పాట్లను మేయర్ బీవై రామయ్య పరిశీలించారు. సభ నిర్వహించనున్న వాల్మీకి మహర్షి విగ్రహం ఉన్న ప్రాంతాన్ని ఆయన గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక చొరవతో ఇటీవలే అసెంబ్లీలో వాల్మీకులను ఎస్‌టీలుగా గుర్తిస్తు తీర్మానం చేశారన్నారు. దశాబ్దాల వాల్మీకుల ఆకాంక్ష త్వరలో సా కారం కానుందన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపేందుకు ఏప్రిల్ 2వ తేదీన కర్నూలులో భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జెడ్పీ కార్యాలయం నుంచి గౌరీ గోపాల్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న వాల్మీకి విగ్రహం వరకు మహా ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం విగ్రహం ప్రాంతంలోనే సభ నిర్వహిస్తామన్నారు. ఈ సభకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంతో పాటు వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నేతలు హాజరవుతున్నట్లు తెలిపారు. వాల్మీకులంతా భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భానుప్రకాష్, విద్యాసాగర్ పాల్గొన్నారు.