మిర్చిని నల్లిపేస్తున్న పురుగులు
అవగాహన కల్పిస్తున్నాం
● మిరప తోటలపై నల్లి దాడి తీవ్రం
●కొన్ని చోట్ల తామరపురుగు ఉధృతి
●వాడిపోతున్న మిరప మొక్కలు
●దిగుబడులపై ఆందోళనలో రైతులు
పెనుగంచిప్రోలు: మిర్చి పొలాలపై నల్లి పురుగుల దాడి రైతులను తీవ్ర ఆందోళనలకు గురి చేస్తోంది. ఈ పురుగులు ఆకులు, కొమ్మలకు వేగంగా నాశనం చేస్తూ పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పైరు ఏపుగా పెరిగి ఆశాజనకంగా ఉంద నుకుంటున్న తరుణంలో ఈ పురుగుల దాడితో రైతులు సతమతమవుతున్నారు. రైతులు ఎక్కువగా తేజ సన్న రకాలను సాగు చేశారు. ఎకరానికి ఇప్పటికే రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టారు. ఇటీవల మొక్కలకు ఎర్రనల్లి, తెల్లనల్లి, తామర పురుగులు ఆశిస్తున్నాయి. వీటి ఉధృతి కారణంగా దిగుబడులు తగ్గిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
తామర పురుగు బెడద
మిర్చి రైతులకు తామర పురుగు బెడద పట్టుకుంది. మిర్చి పంట బాగుండి, దిగుబడి అధికంగా వస్తుందన్న తరుణంలో కొన్ని ప్రాంతాల్లో తామర పురుగులు పైరును ఆశిస్తున్నాయి. మిర్చి పంటపై ఇటీవల వైరస్, తెగులు ప్రభావం చూపించగా తాజాగా తామర పురుగులు కూడా కనిపించటంతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. కంటికి రెప్పలా పెంచుకున్న పంట కళ్లెదుటే వాడిపోతుంటే దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో..
ఎన్టీఆర్ జిల్లాలో ఈఏడాది ఇప్పటి వరకు 8,950 హెక్టార్లలో రైతులు మిర్చి సాగు చేశారు. గత ఏడాది ధర లేక పోవటంతో పాటు దిగుబడులు కూడి లేక రైతులు సగానికి సాగు తగ్గించారు. ఈ ఏడాది మిర్చి తోటలను తామర పురుగు ఆశించింది. అయితే ఇంత వరకు ఉద్యాన శాఖ అధికారులు ఒక్కసారి కూడా తమ పంట పొలాలవైపు చూడలేదని రైతులు ఆరోపిస్తున్నారు. మిర్చిలో వ్యాపించే తెగుళ్లపై అవగాహన సదస్సులు నిర్వహించి ఏఏ మందులు వాడాలో వివరించాలని కోరుతున్నారు.
పంట నాశనం
తామర పురుగులను గుర్తించిన రోజుల వ్యవధిలోనే పంట నాశనం అవుతోందని రైతులు వాపోతున్నారు. తామర పురుగు గుడ్డు నుంచి పురుగుగా మారేందుకు 10–15 రోజులు పడుతుంది. ఇది తల్లి దశలో ఉన్న సమయంలో పూతలో పెరిగి పూత నుంచి కాయ రానివ్వకుండా రైతుకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. ఏ మందు లకూ ఈ పురుగు లొంగటం లేదని రైతులు అంటు న్నారు. దీనికి తోడు అధిక వర్షాలతో మిరప పంటలో నీరు నిల్వ ఉండటంతో వేరుకుళ్లు తెగులు రావటంతో పంట ఎండి పోతోందని ఆందోళన చెందుతున్నారు.
మిర్చిపూతపై నల్లతామర పురుగు
పెనుగంచిప్రోలు మండలంలోని కె.పొన్నవరం వద్ద ఎకరం రూ.25 వేలకు కౌలుకు తీసుకుని మిర్చి సాగు చేశాను. మొదట వైరస్ తెగులు వ్యాపించిన పొలం ఇప్పుడు తామర పురుగు పడి మొత్తం వడబడి పోతోంది. ఎకరానికి రూ.లక్షకు పైగా పెట్టుబడి అయింది. ఈ ఏడాది పత్తి కూడా వర్షాలకు బాగా దెబ్బతింది. ఇప్పుడు మిర్చి పరిస్థితి ఇలా ఉంది. ఏమి చేయాలో అర్థం కావటం లేదు.
– పాపట్ల ఆదాం, రైతు, మునగచర్ల
నేను ఐదెకరాల్లో తేజ రకం మిర్చి సాగు చేశాను. గత ఏడాది ధర పూర్తిగా తగ్గింది. మొన్నటి వరకు పైరు బాగానే ఉంది. రోజుల వ్యవధిలోనే పూతపై నల్లతామర పురుగు విస్తృతంగా కనిపిస్తోంది. ఎకరానికి రూ.లక్షకు పెట్టుబడి అయింది. తెగులు వల్ల పూత ఎదగటం లేదు. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం ఉండటం లేదు. అధికారులు మాకు పంటల పెరుగుదలకు సచనలివ్వాలి.
–కూచి రంగారావు, రైతు, వెంకటాపురం
మిర్చి పంటపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. మిర్చిలో కోయినో ఫోరా కొమ్మకుళ్లు తెగులు ఎక్కువగా ఉంది. దీని నివారణకు కాపర్ ఆక్సీ క్లోరైడ్ 30 గ్రామలు, స్ట్రెప్టోసైక్లిన్ గ్రాము పది లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఎండు తెగులు నివార ణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ మూడు గ్రాములు లీటరు నీటికి కలిపి మొక్క పాదులో పోయాలి. నల్ల తామర పురుగు నివారణకు ఫ్రైడ్ 40 నుంచి 50 గ్రాములు లేదా బెనీవియా 240 గ్రాములు, రీజెంట్ 40 నుంచి 50 గ్రాములు వరకు లేదా పోలీస్ 40నుంచి 50 గ్రాముల వరకు మార్చి మార్చి నాలుగు రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. జిగురు పూసిన పసుపు, బ్లూరంగు అట్టలను ఎకరానికి 20 చొప్పున పెట్టటం వల్ల నల్లతామర పురుగును నివారించవచ్చు.
– నీలిమ, ఉధ్యానశాఖ అధికారి
మిర్చిని నల్లిపేస్తున్న పురుగులు
మిర్చిని నల్లిపేస్తున్న పురుగులు
మిర్చిని నల్లిపేస్తున్న పురుగులు


