ప్రాణాలను బలిగొన్న దొంగతనం నింద
పామర్రు: దొంగతనం నింద తట్టుకోలేక పదో తరగతి విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులకు నూరేళ్లకు సరిపడా కడుపుకోత మిగిల్చాడు. ఈ ఘటన పామర్రులో మంగళవారం జరిగింది. పోలీ సుల కథనం మేరకు.. పామర్రు ఒకటో వార్డులోని యడదిబ్బ ప్రాంతానికి చెందిన ౖకైలే రాజేష్, ధనలక్ష్మి దంపతుల కుమారుడు యశ్వంత్ (15) జమీదగ్గుమిల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. మంగళవారం ఉదయం యశ్వంత్ తన ఇంటి వద్ద ఉన్న కుక్కను తరుముతూ పక్కన ఉన్న మరో ఇంటికి వరకు వెళ్లి, తిరిగి తన ఇంటికి చేరుకున్నాడు. ఈ నేపథ్యలో ఆ ఇంటి యజమాని బొట్టు సాంబశివరావు యశ్వంత్ తమ ఇంట్లోకి వచ్చి రూ.1500 తీశాడని నింద మోపాడు. తాను డబ్బులు తీయలేదని యశ్వంత్ ఎంత చెప్పినా వినకుండా రాజేష్, ధనలక్ష్మి దంపతులతో సాంబ శివరావు గొడవ పడ్డాడు. తమ కుమారుడికి ఆ డబ్బుతో ఎలాంటి సంబంధం లేదని, అవసరమైతే పోయాయంటున్న డబ్బు ఇస్తామని వారు చెప్పినా వినకుండా సాంబశివరావు బెదిరింపులకు దిగాడు. ‘ఇక నుంచి మా ఇంట్లో ఏది పోయినా దానికి నీదే బాధ్యత. నీ సంగతి చూస్తా’ అంటూ యశ్వంత్‌ను బెదిరించాడు. తన బంధువైన విశ్రాంత ఏఎస్‌ఐతో ఫోన్ చేయించి యశ్వంత్‌ను, అతని కుటుంబ సభ్యులను తీవ్రంగా దుర్భాషలాడి బెదిరించాడు. తాను చేయని దొంగతనం నింద మోయాల్సి వచ్చిందన్న మనస్తాపంతో యశ్వంత్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొంత సమయం తరువాత ఇంటికి వచ్చిన రాజేష్, ధనలక్ష్మి దంపతులు యశ్వంత్ మృతి చెందటాన్ని చూసి భోరున విలపించారు. యశ్వంత్ తల్లి ధన లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పామర్రు ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్ తెలిపారు. గుడివాడ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదే హాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.


