
అందం అదరహో
● కృష్ణమ్మ చెంతన సేద తీరేవారికి పర్యాటక అనుభూతి ● ప్రకృతి గీచిన కృష్ణమ్మ ఇసుక తిన్నెలపై పిల్లలకు ఆహ్లాదకరం ● శ్రీరామపాదక్షేత్రం ఎదుట నది మధ్య ఇసుక దీవితో బీచ్ సోయగం
నాగాయలంక: దివిసీమలోని నాగాయలంక శ్రీరామపాద క్షేత్రం పుష్కర ఘాట్ ఎదుట నది మధ్యలో చిరుదీవి ‘నవలంక’. ఇక్కడ కృష్ణమ్మ గీచిన ఇసుక తిన్నెలు సందర్శకులకు వేసవి విడిదిగా అలరిస్తున్నాయి. నది మధ్య ప్రకృతి పరిచిన సహజ సైకత పరదాలతో బీచ్ అందాలు సంతరించుకున్నాయి. ఈ తెల్లటి ఇసుక దిబ్బలు సందర్శకులకు పర్యాటక అనుభూతిని కలిగిస్తూ రా.. రమ్మంటోంది నవలంక సోయగం. ఘాట్ నుంచి సమీపంలోని ఈ ఐల్యాండ్‌కు ప్రైవేట్ పడవల్లో షికారుగా చేరుకుంటారు. గత ఏడాది వరదలకు ఇక్కడి ముళ్ల చెట్లు నదీ ప్రవాహానికి పూర్తిగా తుడిచి పెట్టుకుపోయాయి. దీంతో సముద్రపు బీచ్‌లా ఏర్పడి తెల్లటి స్వచ్ఛమైన ఇసుక తిన్నెలు ఆకర్షణీయంగా మారాయి. వివిధ ఆకృతుల్లోని ఇసుక గుంతలు చూసి పర్యాటకులు ముచ్చట పడుతున్నారు.
సందర్శకులకు ఆహ్లాదం
ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా గుంపులుగా ఈ దీవికి నీటి కొంగలు, బాతులు, ఇతర పక్షులు చేరుతున్నాయి. అవి ఇక్కడ విహరిస్తూ సందర్శకులను ఆహ్లాదపరుస్తూ సేద తీరడంతో నవలంక దీవికి కొత్త అందాలు చేకూరాయి. ప్రభుత్వం మరిన్ని సంరక్షణ చర్యలు చేపడితే, కొన్ని నిర్మాణాలు చేస్తే దివిసీమ ప్రాంత వాసులను ఆహ్లాదపర్చే మంచి పర్యాటక దీవిగా ఆకర్షిస్తుందని సందర్శకులు చెబుతున్నారు. ఈ ప్రాంతవాసులకు నవలంకే వేసవిలో సేద తీర్చే విడిదిగా మారడంతో రోజూ సాయంత్రం వేళల్లో శ్రీరామపాదక్షేత్రం ఘాట్, నవలంక సందర్శనకు ఉత్సాహంగా వస్తున్నారు.
నిత్య సుందరం
నాగాయలంక కృష్ణానది పశ్చిమ దిక్కులో సూర్యాస్తమయ దృశ్యాలు నిత్యం సుందరంగా ఆవిష్కృతమవుతాయి. ఇవి సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. వేసవితాపం, ఒత్తిడి తగ్గించుకునేందుకు ఉదయం, సాయంత్రం వేళల్లో పెద్దలు, యువకులు, చిన్నారులు కృష్ణానదిలో ఈత కొడుతూ సందడి చేస్తుంటారు. చిన్నారులు ఇసుకతో పిచుక గూళ్లు కట్టి కేరింతలతో చేసే సరదాలు, మొబైల్ ఫోన్‌ల ఫొటోలు, సెల్ఫీలతో చేసే సందడి కనువిందు చేస్తున్నాయి. పిల్లలు నదిలోకి బోట్‌లలో నుంచి ఎగిరి దూకుతూ చేసే అల్లరితో పైకెగిసి పడే నీటి జల్లులు పులకరింప చేస్తుంటాయి.
రారండోయ్ నవలంక సోయగం చూద్దాం
సంపూర్ణ పర్యాటక అనుభూతి కలిగేలా అభివృద్ధి చేయాలి
నాగాయలంక శ్రీరామపాద క్షేత్రం ఎదురుగా న్యూ ఐల్యాండ్‌ను పర్యాటకాభివృద్ధి క్రమంలో ప్రాచుర్యం కలిగించేందుకు ప్రణాళిక రూపకల్పన చేయాలి. అప్పుడే దివిసీమ వాసులకు ముఖ్యమైన పర్యాటక కూడలి అనుభూతి కలుగుతుంది. రాష్ట్ర పర్యాటక శాఖ, జిల్లా యంత్రాంగం నవలంక, శ్రీరామపాదక్షేత్రం వైపు దృష్టి సారించాలి. బ్రాండ్ ఇమేజ్ తెచ్చేరీతిలో దివిసీమ పర్యాటక ప్రదేశాలను ప్రాచుర్యంలోకి తేవాలి.
–వాడపల్లి నాగేశ్వరరావు,
ప్రకృతి ప్రేమికుడు, నాగాయలంక

అందం అదరహో

అందం అదరహో

అందం అదరహో

అందం అదరహో