
అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్‌లో వేచి ఉన్న భక్తులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆదివారం రద్దీ సాధారణంగా ఉంది. సర్వ దర్శనం క్యూలైన్‌లో గంట లోపే అమ్మవారి దర్శనం పూర్తయింది. ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు రద్దీ కొనసాగింది. ఉదయం దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించిన ఆర్జిత సేవల్లో ఉభయ దాతలు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున ఖడ్గమాలార్చాన, శ్రీ చక్రనవార్చన, లక్ష కుంకుమార్చన, శాంతి కల్యాణంతో పాటు చండీహోమంలో భక్తుల రద్దీ కనిపించింది. అమ్మవారికి మహా నివేదన నిమిత్తం ఉదయం 11–40 గంటలకు అమ్మవారి దర్శనం నిలిపివేశారు. తిరిగి 12–20 గంటలకు అమ్మవారి దర్శనం తిరిగి ప్రారంభం కాగా, సర్వ దర్శనం, రూ.100, రూ.300, రూ.500 క్యూలైన్లలో భక్తుల తాకిడి కనిపించింది. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవల్లోనూ ఉభయదాతలు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు.
లోక సంరక్షణార్ధం సూర్యోపాసన సేవ
లోక సంరక్షణార్ధం, సర్వ మానవాళి శ్రేయస్సును కాంక్షిస్తూ ఆదివారం దుర్గమ్మ సన్నిధిలో సూర్యోపాసన సేవ జరిగింది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద సూర్యభగవానుడి చిత్రపటానికి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం సూర్య నమస్కారాలు, సూర్యోపాసన సేవ నిర్వహించగా, పలువురు ఉభయదాతలు, భక్తులు పాల్గొన్నారు. ఆర్జిత సేవల్లో పాల్గొన్న ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ మార్గంలో అమ్మవారి దర్శనానికి అనుమతించారు.