
విశేష పుష్పార్చనలో అమ్మవారు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు శుక్రవారం మహా పుష్పార్చన నిర్వహించారు. 22వ తేదీ నుంచి 31వ తేదీ వరకు దుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రోత్సవాలు వైభవంగా నిర్వహించారు. 9 రోజుల పాటు విశేషమైన పుష్పాలతో అర్చన నిర్వహించగా, ఉత్సవాలలో చివరి రోజైన శుక్రవారం అమ్మవారికి మహా పుష్పార్చన నిర్వహించారు. 9 రకాల పుష్పాలతో అర్చన నిర్వహించారు. తొలుత ఆలయ చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో భ్రమరాంబ, స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, ఏఈవో ఎన్ రమేష్‌బాబులతో పాటు ఆలయ సిబ్బంది అమ్మవారి అర్చన కోసం తీసుకువచ్చిన పుష్పాలను మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ వేదిక వద్ధకు తీసుకువచ్చారు. ఆలయ అర్చకులు అమ్మవారికి వేద మంత్రోచ్ఛరణ మధ్య విశేష పుష్పార్చన నిర్వహించిన అనంతరం పంచహారతుల సేవ నిర్వహించారు. కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు, ఉభయదాతలు, భక్తులు పాల్గొన్నారు.
పూర్ణాహుతితో ముగిసిన ఉత్సవాలు
ఇంద్రకీలాద్రిపై నిర్వహిస్తున్న వసంత నవరాత్రోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాలలో ఆలయ అర్చకులు పూర్ణాహుతి జరిపించారు. స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి పర్యవేక్షణలో ఆలయ అర్చకులు యజ్ఞనారాయణశర్మ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ చైర్మన్ కర్నాటి రాంబాబు దంపతులు, ఈవో భ్రమరాంబకు అర్చకులు వేద ఆశీర్వచనం అందజేసి, అమ్మవారి ప్రసాదాలను బహూకరించారు.
దుర్గమ్మ సన్నిధిలో ముగిసిన వసంతోత్సవాలు