
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): మాదకద్రవ్యాల రవాణా, వినియోగంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, పోలీసు కమిషనర్ టి.కె. రాణా పేర్కొన్నారు. అసాంఘిక శక్తులపై కేసులు నమోదు చేసి మాదక ద్రవ్యాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నిషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా మాదక ద్రవ్యాల నివారణకు చేపట్టిన చర్యలపై శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం వీడియో కాన్ఫెరెన్స్ హాలులో పోలీస్ కమీషనర్ టి.కె. రాణా, కలెక్టర్ ఎస్. ఢిల్లీరావుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల అమ్మకం, వినియోగదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత మూడు నెలలుగా గంజాయి, మత్తుపదార్థాల వినియోగంపై దృష్టి పెట్టామన్నారు. నగర పరిధిలో గంజాయి వినియోగానికి హాట్‌స్పాట్‌లు గుర్తించిన క్రీస్తురాజుపురం, గంగిరెద్దులదిబ్బ, కేఎల్ రావు నగర్, రైల్వే యార్డ్, వాంబేకాలనీ, కృష్ణలంక దోబీఘాట్, భవానీఘాట్, కనకదుర్గవారధి, ఇబ్రహీంపట్నం, సీతానగరం తదితర ప్రాంతాలలో తనిఖీలు ముమ్మరం చేశామన్నారు. మూడు నెలల కాలంలో గంజాయి విక్రయదారులపై 69 కేసులు నమోదు చేసి 159 మందిని అరెస్ట్ చేశామన్నారు. 8 మంది గంజూయి సరఫరా దారులను అదుపులోకి తీసుకుని వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేశామన్నారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి జిల్లాకు గంజాయి సరఫరా చేసేవారిని గుర్తించి కేసులు నమోదు చేశామన్నారు. అవసరమైతే నగర బహిష్కరణకు వెనుకాడబోమన్నారు.
అనుక్షణం అప్రమత్తం..
జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల అమ్మకాలు సాగించే వారిపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. గంజాయి రవాణాలో సరఫరాదారులు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారని, వీటిపై దృష్టి పెట్టి అరికట్టేందుకు పోలీసు యంత్రాంగం ప్రత్యేక నిఘా పెట్టిందన్నారు. గంజాయి విక్రయదారుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి అప్రమత్తం చేయాలన్నారు. విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సమావేశంలో సబ్ కలెక్టర్ అదితి సింగ్, డీసీపీ విశాల్ గున్నీ, విభిన్న ప్రతిభావంతుల జిల్లా సంక్షేమ అధికారి రామ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, పోలీస్ కమిషనర్ టి.కె. రాణా