
● కృష్ణా జిల్లాలో 22,436 మంది విద్యార్థులకు 143 పరీక్ష కేంద్రాలు ● డీఈవో కార్యాలయంలో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు ● వివరాలు వెల్లడించిన డీఈవో తాహెరాసుల్తానా
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి తాహెరాసుల్తానా తెలిపారు. ఆమె కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. డీఈవో మాట్లాడుతూ ఏప్రిల్ 3 నుంచి 12వ తేదీ వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటలకు జరిగే పదో తరగతి పరీక్షలు జరుగుతాయన్నారు. ఈ పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో 143 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 22,636 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారన్నారు. వీరిలో 12,048 మంది బాలురు, 10,388 మంది బాలికలు ఉన్నారన్నారు.
1,564 మంది సిబ్బంది నియామకం..
పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి 1,564 మంది సిబ్బందిని వివిధ కేటగిరీల వారీగా విధులు అప్పగిస్తూ సిబ్బందికి ఉత్తర్వులు జారీ చేశామని డీఈవో తెలిపారు. వీరిలో 143 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 143 మంది డిపార్ట్‌మెంట్ అధికారులు, ప్రశ్నపత్రాలు పంపిణీ కోసం పది రూట్లను ఎంపిక చేసి 10 మంది అధికారులను నియమించామన్నారు. వీరితో పాటు అడిషనల్ రూట్ ఆఫీసర్స్ 10 మంది, 29 స్టోరేజీ పాయింట్స్ (పోలీస్ స్టేషన్లు)కు 34 మంది సిబ్బందిని కస్టోడియన్లుగా నియమించామని చెప్పారు. సిట్టింగ్ స్క్వాడ్స్ 19 మంది, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఐదుగురు, 1200 మంది ఇన్విజిలేటర్లను నియమించామని డీఈవో తెలిపారు.
ఈ సెంటర్లపై మరింత ఫోకస్..
జిల్లాలో పరీక్ష కేంద్రాల నిర్వహణలో నాలుగు సున్నితమైన కేంద్రాలను గుర్తించినట్లు డీఈవో తెలిపారు. జిల్లాలో డోకిపర్రు, పెదతుమ్మిడి, పునాదిపాడు, శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను గుర్తించామని, వీటిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. గత సంవత్సరం పరీక్షల్లో అవాంఛనీయ సంఘటనలకు పాల్పడిన వారికి పరీక్షల్లో విధులు కేటాయించకుండా వారిని ఆయా మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో ఉంచామని చెప్పారు. పరీక్ష కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లు లేకుండా చూడటంతో పాటు 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నామని ఆమె తెలిపారు. ప్రశ్నపత్రాలు లీకయ్యాయని సోషల్ మీడియా తదితర మాధ్యమాల ద్వారా వదంతులు వస్తే వాటిని నమ్మవద్దని, వదంతులు సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్ష కేంద్రాలన్నీ మొబైల్ ఫ్రీ జోన్‌గా నిర్ణయించినట్లు డీఈవో తెలిపారు.
మొబైల్ వాహనం ద్వారా వైద్యసేవలు..
పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులు ఎటువంటి అనారోగ్యానికి గురైనా వెంటనే వైద్యసహాయం అందించేందుకు మూడు, నాలుగు కేంద్రాలకు ఒక మొబైల్ వాహనాన్ని వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ వాహనం ద్వారా ఎవరైనా విద్యార్థులకు పరీక్ష సమయంలో అనారోగ్యానికి గురైనప్పుడు చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు హాల్‌టికెట్లు చూపితే ఆర్టీసీ బస్సుల ద్వారా పరీక్ష కేంద్రానికి ఉచితంగా చేరవేసే సౌకర్యాన్ని కల్పించామన్నారు.
కంట్రోల్‌రూమ్ ఏర్పాటు..
పది పరీక్షల నిర్వహణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా, సమస్యలు ఎదురైనా వాటిని పరిష్కరించేందుకు కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు డీఈవో తెలిపారు. విద్యార్థులు 9848530928, 9848232601, 9966753718 నంబర్లను సంప్రదించాలన్నారు. జిల్లాలో పది పరీక్షల నిర్వహణకు పరిశీలకులుగా సీ–మ్యాట్ డైరెక్టర్ మస్తానయ్యను ప్రభుత్వం నియమించినట్లు డీఈవో తెలిపారు. జిల్లాలో పది పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె కోరారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ (పరీక్షలు) డేవిడ్ రాజు పాల్గొన్నారు.