
అధికారులతో మాట్లాడుతున్న డీఆర్వో వెంకటేశ్వర్లు
చిలకలపూడి(మచిలీపట్నం): ఏప్రిల్ 2, 4 తేదీల్లో జరగనున్న ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు. పరీక్షల నిర్వహణపై ఆయన చాంబర్‌లో శుక్రవారం వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ జిల్లాలోని పెనమలూరు పరీక్షా కేంద్రంలో ఆయుర్వేద హోమియోపతి, యునాని వైద్యాధికారులు, అధ్యాపకులు, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంబంధించి మెడికల్ అధికారుల కోసం పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. ఈ పరీక్షకు 699 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు రెండు షిఫ్ట్‌లలో ఈ పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. ఏప్రిల్ 4వ తేదీన జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు పరీక్ష ఉందన్నారు. ఈ పరీక్షకు 770 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని, విజయవాడలోని కానూరు వద్ద నున్న వైజయంతి భవన్‌లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అనంతరం మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు రెండు దశలుగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులకు అన్ని సౌకర్యాలు కల్పించటం జరిగిందన్నారు. ఏపీపీఎస్సీ మార్గదర్శకాలు, నిబంధనల ప్రకారం పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. తహసీల్దార్, డెప్యూటీ తహసీల్దార్లను లైజనింగ్ అధికారులుగా ఏర్పాటు చేశామని, ఫ్లయింగ్ స్క్వాడ్, సూపర్‌వైజర్లు, చీఫ్ సూపరింటెండెంట్లను నియమించామన్నారు. ఏపీపీఎస్సీ ప్రతినిధులు ఎం.ఆరోగ్యరాణి, జె.జయంతి, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శివాజీ తదితరులు పాల్గొన్నారు.