
మధురానగర్(విజయవాడసెంట్రల్): హెచ్‌ఐవీ బాధితులకు త్వరితగతిన వైద్యసేవలు అందించేందుకు లింక్ ఏఆర్‌టీ సెంటర్‌లను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు తెలిపారు. రాజీవ్‌నగర్ ఆరోగ్యకేంద్రంలో ఏపీశాక్స్ ఆధ్వర్యాన శుక్రవారం నూతనంగా ఏర్పాటు చేసిన లింక్ ఏఆర్‌టీ సెంటర్ ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డీఎంహెచ్‌వో డాక్టర్ మాచర్ల సుహాసిని, అదనపు వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జూపూడి ఉషారాణితో కలిసి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఢిల్లీరావు మాట్లాడుతూ హెచ్‌ఐవీ బాధితుల జీవన ప్రమాణం పెంపొందించటానికి ఎంతో ఖరీదయిన ఏఆర్‌టీ చికిత్సను కేంద్రాల ద్వారా అందిస్తున్నామని చెప్పారు. బాధితులు ఏఆర్‌టీ సెంటర్‌కు వెళ్లడానికి వ్యయప్రయాసలకు గురికావాల్సి వస్తున్నందన వారికి సమీపంలోనే ఆరోగ్య సేవలు అందించేందుకు లింక్ ఏఆర్‌టీ సెంటర్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్‌టీఆర్ జిల్లా నందిగామలో లింక్ ఏఆర్‌టీ ప్లస్ సెంటర్‌తో పాటు జగ్గయ్యపేట, మైలవరం, తిరువూరు లింక్ ఏఆర్‌టీ సెంటర్‌ల ద్వారా హెచ్‌ఐవీ రోగులకు ఏఆర్‌టీ చికిత్స అందిస్తున్నామన్నారు. ఇప్పుడు హెచ్‌ఐవీ రోగుల సౌకర్యార్ధం రాజీవ్‌నగర్‌లో సెంటర్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ మాచర్ల సుహాసిని మాట్లాడుతూ రాజీవ్‌నగర్ చుట్టు ప్రక్కల ప్రాంతాలకు చెందిన బాధితులు లింక్ ఏఆర్‌టీ సెంటర్‌లోనే చికిత్స తీసుకోవచ్చన్నారు. డాక్టర్ జూపూడి ఉషారాణి మాట్లాడుతూ షేర్ ఇండియా స్వచ్ఛంద సంస్థ సహకారంతో మందులు సక్రమంగా వాడుతూ ఆరోగ్యం బాగున్న వారికి ఏఆర్‌టీ మందులు ఇస్తారని పేర్కొన్నారు. కండ్రిక, రాజీవ్‌నగర్, నున్న, వాంబేకాలనీ, ప్రకాషన్‌నగర్ , పాయకాపురం, అజిత్‌సింగ్‌నగర్ తదితర ప్రాంత వాసులకు ఈ సెంటర్ దగ్గరగా ఉంటుందన్నారు. నగర పాలక సంస్థ ఏఎంహెచ్‌ఓ డాక్టర్ సీహెచ్ బాబూ శ్రీనివాస్, ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి డాక్టర్ భాస్కర్, ఏఆర్‌టీ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బి.జేమ్స్ మనోజ్‌కుమార్, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మండలి డీపీఎం కిరణ్ పందిటి, జిల్లా ఐసీటీసీ సూపర్‌వైజర్ జె.ప్రశాంతి చౌదరి, షేర్ ఇండియా స్వచ్ఛంద సంస్థ సిబ్బంది ఎం.జాన్‌వెస్లీ, అవధానులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఢిల్లీరావు
రాజీవ్‌నగర్ ఆరోగ్య కేంద్రంలో లింక్ ఏఆర్‌టీ సెంటర్ ప్రారంభం