తోట్లవల్లూరు: మామను చంపిన కేసులో కోడలికి, ఆమె ప్రియుడికి యావజ్జీవ ఖైదు పడింది. తోట్లవల్లూరు ఎస్‌ఐ జి.రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణాజిల్లా తోట్లవల్లూరుకు చెందిన దళితనేత డక్కమడుగుల ఏసు 2015 జూలై 4 రాత్రి తన ఇంట్లోనే దారుణహత్యకు గురయ్యాడు. తన వివాహేతర సంబఽంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో కోడలు డక్కమడుగుల పద్మ తన ప్రియుడు చాట్ల అనిల్‌కుమార్‌తో కలిసి ఇంట్లోనే ఏసును అంతమొందించి, శవాన్ని గోనె సంచిలో కట్టి బందరు కాలువలో పడేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు ఏసు హత్యలో ఏ 1గా డక్కమడుగుల పద్మ, ఏ 2గా చాట్ల అనిల్‌కుమార్‌ను అరెస్టు చేశారు. విజయవాడలోని 12వ అడిషనల్ డిస్ట్రిక్టు సెషన్సు కోర్టు న్యాయమూర్తి పి.భాస్కరరావు సోమవారం ఈ కేసు విచారణ జరిపి తీర్పు వెల్లడించారు. ఇద్దరు నిందితులకు యావజ్జీవ కఠిన కారాగార శిక్షతోపాటు రూ. 5 వేల జరిమానా విధించారు.