బుజ్జగింపులు.. నామినేషన్లు | - | Sakshi
Sakshi News home page

బుజ్జగింపులు.. నామినేషన్లు

Dec 4 2025 7:32 AM | Updated on Dec 4 2025 7:32 AM

బుజ్జ

బుజ్జగింపులు.. నామినేషన్లు

● తొలి విడతలో తేలిన అభ్యర్థులు.. ● మూడో విడత నామినేషన్ల స్వీకరణ షురూ ● గెలుపు వ్యూహాలపై అభ్యర్థుల కసరత్తు

ఆసిఫాబాద్‌: పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. కొన్ని మండలాల్లో అభ్యర్థులు గెలుపు కోసం పోటీదారులను బుజ్జగిస్తుంటే.. మరికొన్ని మండలాల్లో నామినేషన్లు ప్రక్రియ జోరుగా సాగుతోంది. జిల్లాలోని 335 గ్రామ పంచాయతీలు, 2,874 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. తొలివిడత ఎన్నికల్లో భాగంగా అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. వారికి ప్రచారమే మిగిలింది. ఇక రెండో విడత నామినేషన్ల పరిశీలన కొనసాగుతుండగా, మూడో విడత నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. తొలి విడతలో జైనూర్‌, లింగాపూర్‌, సిర్పూర్‌(యూ), కెరమెరి, వాంకిడి మండలాల్లోని 114 పంచాయతీల్లో సర్పంచ్‌ స్థా నాలకు 522, 944 వార్డు సభ్యుల స్థానాలకు 1,424 నామినేషన్లు దాఖలయ్యాయి. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూరికాగా, రాత్రి వరకు అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. రెండో విడతలో బెజ్జూర్‌, చింతలమానెపల్లి, దహెగాం, కౌటాల, పెంచికల్‌పేట్‌, సిర్పూర్‌– టి మండలాల్లో నామినేషన్ల ప్రక్రియ మంగళవారం పూర్తయ్యింది. 113 సర్పంచ్‌ స్థానాలకు 737 నామినేషన్లు, 992 వార్డు సభ్యులకు 2,428 నామినేషన్లు దాఖలయ్యాయి. బుధవారం నామినేషన్ల పరిశీలన చేపట్టారు. ఇక మూడో విడత కింద ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌, రెబ్బెన, తిర్యాణి మండలాల్లో 108 సర్పంచ్‌ స్థానాలు, 938 వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది.

సమర్థులకే పట్టం

పంచాయతీ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా సమర్థవంతమైన అభ్యర్థులే కావాలని ప్రజలు ఆశిస్తున్నారు. అందుబాటులో ఉంటూ, సేవ చేసే గుణం, పంచాయతీ అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సోషల్‌ మీడియాలోనూ జోరుగా చర్చ సాగుతోంది. మండల కేంద్రాలతోపాటు జిల్లా కేంద్రంలోని రాజంపేట పంచాయతీపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పార్టీ గుర్తులు లేనప్పటికీ రాజకీయ పార్టీల మద్దతు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. తొలివిడత గుర్తుల కేటాయింపు పూర్తికాగా, రెండో విడత పోటీలో ఉన్న అభ్యర్థుల బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. బలమైన పోటీదారులను ఉపసంహరించుకోవాలని ఒప్పిస్తున్నారు. ఆయా పార్టీల ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు సమావేశాలు నిర్వహిస్తూ సమన్వయం చేస్తున్నారు.

ప్రధాన పార్టీలకు సవాల్‌

గ్రామ పంచాయతీ ఎన్నికలు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీకి సవాల్‌గా మారాయి. కాంగ్రెస్‌ పార్టీ ప్రజల్లో తమ విశ్వాసాన్ని మరోసారి నిరూపించుకోవడానికి కసరత్తు చేస్తోంది. ఆరు గ్యారంటీలను గ్రామస్థాయిలో ప్రచారం చేసి తమ అభ్యర్థులను గెలిపించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇక బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోయిన తర్వాత పల్లెల్లో జోరందుకునేందుకు యత్నిస్తుంది. ఆ పార్టీ ఎమ్మెల్యే అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ సైతం పంచాయతీ స్థాయిలో బలం పెంచుకోవడానికి వ్యూహాలు రచిస్తోంది. యువతను ఆకర్శించేందుకు యత్నిస్తోంది. అయితే అభ్యర్థుల తుది జాబితా అనంతరం పోలింగ్‌కు కేవలం వారం రోజులే సమయం ఉండటంతో ప్రచారానికి ఇబ్బందిగా మారింది. దీంతో అభ్యర్థులు నామినేషన్ల నుంచే ప్రచారం చేస్తున్నారు.

లింగాపూర్‌: లింగాపూర్‌ మండలంలోని 14 గ్రామ పంచాయతీలు ఉండగా మొత్తం ఎస్టీ రిజర్వేషన్‌ చేశారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం బుధవారం మండలంలోని మామిడిపల్లి, కంచన్‌పల్లి పంచాయతీల్లో మహిళా అభ్యర్థులు మడావి మారుబాయి, కనక పార్వతీబాయి ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎంపీడీవో రాంచందర్‌ ప్రకటించారు. కంచన్‌పల్లిలో సర్పంచ్‌ స్థానానికి కనక పార్వతీబాయి ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేశారు. మామిడిపల్లిలో ఆరుగురు నామినేషన్లు వేయగా, ఉపసంహరణ అనంతరం మారుబాయి ఒక్కరే మిగిలారు.

భూపాలపట్నం ఏకగ్రీవం

సిర్పూర్‌(టి): మండలంలోని భూపాలపట్నం గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా కోర్వెత రాజారాం ఏకగ్రీవమయ్యారు. పంచాయతీ ప్రజలు, అన్ని పార్టీల నాయకులు ఏకమై ఏకగ్రీవంగా ఎన్నుకుని కోర్వెత రాజారాం ఒక్కరితోనే నామినేషన్‌ దాఖలు వేయించారు. తనపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు.

బుజ్జగింపులు.. నామినేషన్లు1
1/1

బుజ్జగింపులు.. నామినేషన్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement