
మహనీయుల త్యాగాల స్ఫూర్తితో అభివృద్ధి
ఆసిఫాబాద్: మహానీయుల త్యాగాల స్ఫూర్తితో జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం తెలంగాణ సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రోశయ్య జయంతి సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి, అదనపు కలెక్టర్ డేవిడ్‌తో కలిసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమురయ్య బహుజనుల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారన్నారు. నిజాంకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడారని గుర్తు చేశారు. రోశయ్య గొప్ప ఆర్థికవేత్త అని, 16 సార్లు ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశ పెట్టారని కొనియాడారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ జిల్లా అధికారి సజీవన్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రమాదేవి, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, కలెక్టరేట్ ఏవో కిరణ్‌కుమార్, ఏఎంసీ చైర్మన్ చిలువేరు వెంకన్న, నాయకులు అరిగెల మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.