
లైటింగ్ లేదు.. నేరుగా హైవే పైకి
రెబ్బెన(ఆసిఫాబాద్): రెబ్బెన మండల పరిధిలోని ఎడవెల్లి, ఇందిరానగర్‌ల వద్ద జాతీయ రహదారిపై తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ రెండు గ్రామాల వద్ద ఏర్పాటు చేసిన యూటర్న్‌ల వద్ద సరైన లైటింగ్ సిస్టం లేదు. వాహనదారులు నేరుగా జాతీయ రహదారి పైకి రాకుండా.. ప్రత్యామ్నాయంగా సర్వీసు రోడ్లు అందుబాటులో లేవు. రాత్రిపూట రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్లే వారు వాహనదారులకు కనిపించకపోవడంతో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇందిరానగర్ వద్ద ఇప్పటివరకు ముగ్గురు వ్యక్తులు ఇదే తరహాలో రోడ్డు దాటే క్రమంలో వాహనాలు ఢీకొని మృతిచెందారు. అదే సర్వీసు రోడ్డు సౌకర్యం కల్పించి ఉంటే ప్రజలు ఆ రోడ్డు గుండా రాకపోకలు సాగించేవారు. గ్రామం నుంచి బయటకు వచ్చే వాహనదారులు సైతం నేరుగా జాతీయ రహదారి పైకి రాకుండా సర్వీసు రోడ్డు గుండా ప్రయాణించి.. ఆపై హైవే పైకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఎడవెల్లి వద్ద ఒక వైపు నుంచి పర్సనంబాల, మరో వైపు కొండపల్లి గ్రామాలు ఉంటాయి. అక్కడ తప్పనిసరిగా సర్వీసు రోడ్డు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు నేషనల్ హైవే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎడవెల్లి, ఇందిరానగర్‌ల వద్ద రోడ్డు ప్రమాదాల తీవ్రత దృష్ట్యా పోలీసులు సమస్యాత్మక ప్రదేశాలుగా గుర్తించారు. రోడ్డు దాటే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సులు కల్పించారు. అప్పటి నుంచి రోడ్డు ప్రమాదాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఈ జాగ్రత్త చర్యలు తాత్కాలిక ఉపశమనమే తప్పా శాశ్వత పరిష్కారం కాదు.