రోడ్లపై చెత్త.. కాలువల్లో పూడిక.. | - | Sakshi
Sakshi News home page

రోడ్లపై చెత్త.. కాలువల్లో పూడిక..

Jul 6 2025 6:37 AM | Updated on Jul 6 2025 6:37 AM

రోడ్ల

రోడ్లపై చెత్త.. కాలువల్లో పూడిక..

మున్సిపాలిటీల్లో గాడితప్పిన పారిశుద్ధ్య నిర్వహణ నిషేధిత ప్రాంతాల్లో చెత్తను వేస్తున్న ప్రజలు పొంచిఉన్న వ్యాధుల ముప్పు 100 రోజుల ప్రణాళికలోనైనా మెరుగుపడేనా..?

జిల్లాలోని కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య నిర్వహణ గాడితప్పుతోంది. వర్షాకాలంలో వ్యాధుల ముప్పు పొంచి ఉన్నా.. రోడ్లపైనే చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. మురుగు నీరు ఇళ్ల మధ్యనే నిలుస్తోంది. కొన్నిచోట్ల రోడ్లపైనే పారుతోంది. ఇక డ్రెయినేజీల్లో నెలల తరబడి పూడిక తీయడం లేదు. పట్టణాల్లోని ఖాళీ స్థలాలు దోమలకు ఆవాసంగా మారుతున్నాయి. దీంతో వ్యాధుల ముప్పు పొంచి ఉందని పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రెండు మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య పరిస్థితిపై ప్రత్యేక కథనం.

ఫొటోలో కనిపిస్తోంది కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీనగర్‌ ఏరియాలోని ప్రధాన రోడ్డు పక్కన గల డ్రెయినేజీ. ఈ కాలువ నిర్మాణం సరిగా చేపట్టకపోవడంతో మురుగునీరు కాలువలోనే నిలిచి ఉంటోంది. దీనికి తోడు ప్లాస్టిక్‌ కవర్లు, చెత్తా చెదారం ఇందులోనే వేస్తుండడంతో పేరుకుపోయి దుర్గంధం తలపిస్తోంది. వర్షాకాలంలో నీరు నిలిచి ఉండడంతో దోమలు, ఈగలు వృద్ధిచెంది రోగాల బారిన పడే అవకాశం ఉందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఫొటోలో కనిపిస్తోంది కాగజ్‌నగర్‌ పట్టణంలోని సీతాపతిరోడ్‌ నుంచి ప్రధాన రహదారికి వెళ్లే మార్గంలో ఉన్న ఖాళీ స్థలం. ఇందులో బాలాజీనగర్‌, శ్రీరాంనగర్‌ కాలనీవాసులు ప్రతీరోజు ద్విచక్ర వాహనాల పై చెత్తను తీసుకువచ్చి ఇక్కడ వేస్తున్నారు. ఇందిరా మార్కెట్‌ వ్యాపారులు సైతం కుళ్లిన కూరగాయలు, పండ్లు తీసుకువచ్చి ఇక్కడే వేయడంతో చెత్తకుప్పగా మారింది. అంతేకాకుండా ఆఫీసులకు వెళ్ళేవారు కూడా కవర్లలో చెత్తను తీసుకువచ్చి ఇక్కడే పడేస్తున్నారు. ఖాళీ స్థలంలో చెత్తవేస్తే రూ.500 జరిమానా విధిస్తామని మున్సిపల్‌ అధికారులు ఏర్పాటు చేసిన బోర్డు వారికి కనిపించకపోవడం గమనార్హం

కాగజ్‌నగర్‌టౌన్‌/కాగజ్‌నగర్‌రూరల్‌: మున్సి పాలిటీ పరిధిలో ట్రాక్టర్లతో ప్రతిరోజు చెత్త సేకరణ చేస్తున్నా కొందరు సిబ్బందికి ఇవ్వకుండా ఖాళీ ప్రదేశాలు, రోడ్ల వెంబడి, నిషేధిత ప్రాంతాల్లో ఎక్కడపడితే అక్కడ చెత్త పడేస్తున్నారు. దీంతో దుర్వాసన వెదజల్లడమే కాకుండా ఈగలు, దోమలు వృద్ధి చెందుతున్నాయి. గాలి వీస్తే చెత్త సమీపంలోని ఇళ్ల ముందు వచ్చి చేరుతోంది. తడి, పొడి, హానికరమైన చెత్తను వేరుచేసి మున్సిపల్‌ కార్మికులకు అందించాలని ప్రజలకు అవగాహన కల్పించినా అమలుకు నోచుకోవడం లేదు. మరోవైపు డ్రెయినేజీల్లో పూడిక తీయకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలక ముందే పారిశుద్ధ్యం మెరుగుపర్చాలని కోరుతున్నారు.

నిషేధిత ప్రాంతాల్లో చెత్త

పట్టణంలోని ద్వారకానగర్‌, సీతాపతిరోడ్‌, సీహెచ్‌సీ, బాలాజీనగర్‌, గాంధీచౌక్‌, మార్కెట్‌ ఏరియాల్లో చెత్త వేయవద్దని మున్సిపల్‌ అధికారులు బోర్డులు ఏర్పాటు చేసినా ఆయా కాలనీల ప్రజలు చెత్తను అక్కడే వేస్తున్నారు. ఉదయం మున్సిపల్‌ పారిశుద్ధ్య సిబ్బంది చెత్తను తొలగించినా మళ్ళీ అక్కడే వేస్తుండడంతో దుర్వాసన వెదజల్లుతోంది.

నెలల తరబడి తీయని పూడిక

పట్టణంలోని బాలాజీనగర్‌, గాంధీనగర్‌, న్యూకాలనీ, టీచర్స్‌ కాలనీ, సంజీవయ్య కాలనీ, నిజాముద్దీన్‌కాలనీ, రైల్వేస్టేషన్‌ రోడ్‌, నౌగాం బస్తీ, కాపువాడ, తదితర కాలనీల్లోని డ్రెయినేజీల్లో నెలల తరబడి పూడిక తీయకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. కొన్నిచోట్ల డ్రెయినేజీల్లో ప్లాస్టిక్‌ కవర్లు, చెత్తాచెదారంతో నిండిపోయాయి.

రోడ్లపైకి మురుగునీరు

పట్టణంలోని ప్రధాన మార్కెట్‌ ఏరియా, పొట్టి శ్రీరాములు చౌరస్తా, చోటిమసీద్‌, ఇందిరా మార్కెట్‌ ఏరియాల్లోని డ్రెయినేజీలు ఇరుకుగా ఉండడంతో పాటు కాలువల్లో దుకాణదారులు ప్లాస్టిక్‌ కవరు, చెత్తాచెదారం వేయడంతో చిన్నపాటి వర్షం కురిసినా మురుగు కాలువల్లోని చెత్తా చెదారం, మురుగునీరు నీరు రోడ్లపై పారుతోంది.

135 మంది సిబ్బంది విధులు

కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలో 30 వార్డులు ఉన్నాయి. చెత్త సేకరణ, పారిశుద్ధ్య నిర్వహణకు 135 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో పర్మినెంట్‌ 21, ఔట్‌ సోర్సింగ్‌ 107, ఎంఎన్‌ఆర్‌ ఏడుగురితో పాటు 7 చెత్త ట్రాక్టర్లు, 20 ట్రాలీలు, 1 జేసీబీ, 1 డోజర్‌లతో ప్రతిరోజు 24 మెట్రిక్‌ టన్నుల చెత్తను డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు.

చర్యలు తీసుకుంటున్నాం

పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. మున్సిపాలిటీ పరిధిలో ఖాళీ స్థలాలు, నిషేధిత ప్రాంతాల్లో చెత్త వేసిన వారికి నోటీసులు జారీ చేస్తాం. 30 వార్డుల్లో పారిశుద్ధ్య సిబ్బందితో విడతల వారీగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టడం జరుగుతోంది.

– ఎల్పుల రాజేందర్‌,

కమిషనర్‌, కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ

రోడ్లపై చెత్త.. కాలువల్లో పూడిక.. 1
1/2

రోడ్లపై చెత్త.. కాలువల్లో పూడిక..

రోడ్లపై చెత్త.. కాలువల్లో పూడిక.. 2
2/2

రోడ్లపై చెత్త.. కాలువల్లో పూడిక..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement