
పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండాలి
చింతలమానెపల్లి/కౌటాల/బెజ్జూర్ : పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. చింతలమానెపల్లి, కౌటాల, బెజ్జూర్ పోలీస్ స్టేషన్లను బుధవారం తనిఖీ చేశారు. కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతల రక్షణ పోలీసుల బాధ్యతని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని, బ్లూకోల్ట్ సిబ్బంది డయ ల్ 100 కాల్స్‌కు స్పందించి తక్షణమే ఘటనా స్థలానికి చేరుకోవాలని సూచించారు. పాత నేరస్తులపై నిఘా ఉంచాలని, సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి పెట్టాలన్నారు. సరిహద్దు నుంచి అక్రమ రవాణా నియంత్రించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పించి, నివారణ కోసం కృషి చేయాలని అన్నారు. ఆయా కార్యక్రమాల్లో కాగజ్‌నగర్ డీఎస్పీ రామానుజం, కౌటాల సీఐ ముత్యం రమేశ్, ఎస్సైలు ఇస్లావత్ నరేశ్, విజయ్, ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.