
సమ్మె విజయవంతం చేయాలి
కాగజనగర్‌టౌన్: దేశవ్యాప్తంగా జూలై 9న నిర్వహించే సార్వత్రిక సమ్మెలో అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు పిలుపునిచ్చారు. కాగజ్‌నగర్ పట్టణంలోని సిర్పూర్ రోడ్ సమీపంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆదివారం జిల్లా నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 8 గంటల పని గంటల విధానాన్ని కార్మికులు పోరాటం చేసి తెచ్చుకుంటే.. కేంద్ర ప్రభుత్వం 12 గంటలుగా మార్చేందుకు లేబర్ కోడ్‌లు తీసుకువచ్చిందని తెలిపారు. వ్యవసాయ కూలీలకు కనీస వేతనాలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. ఉపాధిహామీ కూలీలకు 200 పనిదినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా జిల్లాలోని అన్ని మండలాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని కోరారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ముంజం శ్రీనివాస్, అధ్యక్షుడు రాజేందర్, ఉపాధ్యక్షురాలు త్రివేణి, టీఎస్ యూటీఎఫ్ నాయకులు రాజ్‌కమలాకర్‌రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ ముంజం ఆనంద్‌కుమార్, నాయకులు కృష్ణమాచారి, రూప, అరుణ, మల్లేశ్వరి, పద్మ, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.