
ప్రజాప్రభుత్వంలోనే ప్రగతి
● అర్హులకు సంక్షేమ ఫలాలు అందించాలి ● దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక నంబర్ ● మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ ● ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లా స్థాయి సమీక్షా సమావేశం ● నాలుగు గంటలు కొనసాగిన సమావేశం
మంచిర్యాల ఎమ్మెల్యే గైర్హాజరు
ఆదిలాబాద్ జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి సమీక్షా సమావేశానికి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు గైర్హాజరయ్యారు. ఎమ్మెల్యే గైర్హాజరుపై పలువురు చర్చించుకోవడం కనిపించింది.
సాక్షి, ఆదిలాబాద్/కైలాస్‌నగర్: ప్రజాప్రభుత్వంలోనే రాష్ట్రం ప్రగతిపథంలో ముందుకెళ్తోందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి జిల్లాకు చెందిన రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, మైనింగ్ శాఖల మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందించే బాధ్యత అధికారులేదనని చెప్పారు. ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా నియమితులైన తర్వాత తొలిసారి జూపల్లి కృష్ణారావు, మరో మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి గురువారం ఆదిలాబాద్‌లోని జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు కాంగ్రెస్ ప్ర భుత్వ పనితీరును స్పష్టం చేస్తూ అధికారులు ఎలా ముందుకెళ్లాలో దిశానిర్దేశం చేశారు. మొదట వ్యవసాయ శాఖపై సుదీర్ఘంగా సమీక్షించారు. రైతులకు విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలు విక్రయించేవారికి జైలు శిక్ష పడేలా కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్లు, ఎస్పీలకు సూచించారు. ఇక నుంచి జిల్లాల వారీగానే సమీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. అనంతరం మృతి చెందిన స్వయం సహాయక సంఘాల కుటుంబీకులకు మంజూరైన రూ.10లక్షల ఆర్థికసాయం చెక్కులు పంపిణీ చేశా రు. పాఠశాల విద్యార్థులకు ట్యాబ్‌లు అందజేశారు. ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, జాదవ్ అనిల్‌కుమార్, వెడ్మ బొజ్జు, గడ్డం వినోద్, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, రామారావు పటేల్‌తోపాటు కలెక్టర్లు రాజర్షి షా, కుమార్ దీపక్, అభిలాష అభినవ్, వెంకటేశ్ దోత్రే, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, ఎస్పీలు అఖిల్ మహాజన్, జానకీ షర్మిల, కాంతిలాల్ పాటిల్, అడిషనల్ కలెక్టర్లు, ట్రైనీ కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
మంత్రులకు ఘన సన్మానం
ఇన్‌చార్జి మంత్రిగా నియమితులైన జూపల్లి కృష్ణారావుతోపాటు ఇటీవలే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఉమ్మడి జిల్లాకు చెందిన వివేక్‌ను ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్‌జాదవ్, కోవ లక్ష్మి, కలెక్టర్ రాజర్షి షా శాలువాలతో సత్కరించారు. జ్ఞాపికలు అందజేసి అభినందనలు తెలిపారు.
సీఆర్‌ఆర్ ఇంటికి వెళ్లిన ‘జూపల్లి’
తొలిసారిగా జిల్లాకు వచ్చిన ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పట్టణంలోని శాంతినగర్‌లోగల మాజీ మంత్రి, దివంగత చిల్కూరి రామచంద్రారెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్‌కు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. రామచంద్రారెడ్డి మరణం కాంగ్రెస్‌కు తీరని లోటని పేర్కొన్నారు. ఆయన మేనల్లుడు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంజీవరెడ్డిని పరామర్శించారు.
ఎమ్మెల్యే కోవ లక్ష్మి అలక
సమావేశం ప్రారంభమయ్యాక కాసేపటికి వేదికపైకి వచ్చిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి కుర్చీ లేకపోవడంతో కొద్దిసేపు నిల్చూనే ఉన్నారు. జెడ్పీ సిబ్బంది వెంటనే కుర్చీ తీసుకువచ్చి వేయగా ఆసీనులయ్యారు. ఈ తర్వాత ఏమనుకున్నారో తెలియదు గాని ఎమ్మెల్సీ దండే విఠల్‌తో కలిసి వేదిక దిగి అధికారుల కుర్చీల్లో కూర్చున్నారు. మంత్రి ప్రసంగిస్తున్న సమయంలో దీన్ని గమనించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కోవ లక్ష్మి వద్దకు వచ్చి తన సీట్లో కూర్చోవాలని కోరారు. మంత్రి కూడా ఆహ్వానించడంతో తిరిగి వేదికపైకి వచ్చి అనిల్ జాదవ్ సీట్లో కూర్చున్నారు.

ప్రజాప్రభుత్వంలోనే ప్రగతి