
● పర్యావరణ పరిరక్షణకు సింగరేణి యాజమాన్యం ప్రాధాన్యం ● బ
వచ్చే నెలలో నాటుతాం
ఈ సంవత్సరం వనమహోత్సవం కార్యక్రమానికి సంబంధించి కార్పొరేట్ తేదీ ఖరారు చేయలేదు. వచ్చే నెల మొదటి లేదా రెండో వారంలో తేదీని ఖరారు చేస్తారని అనుకుంటున్నా. ఏరియాలో సుమారు 2లక్షల వరకు నాటాలని అనుకుంటున్నాం. నాటిన ప్రతీ మొక్క బతికేలా చూస్తాం. అవి చెట్లుగా మారినప్పుడే వాటి నుంచి ప్రయోజనం పొందగలుతాం.
– విజయ భాస్కర్‌రెడ్డి,
జనరల్ మేనేజర్, బెల్లంపల్లి ఏరియా
సింగరేణి పెంచుతున్న చెట్లతో కళకళలాడుతున్న డోర్లి– 1 ఓబీ డంప్‌యార్డు
రెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణి సంస్థ పచ్చదనం, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తోంది. బొగ్గు ను ఉత్పత్తి చేసే నల్లనేలలపై పచ్చదనం పరుస్తోంది. ఏటా ఏరియాల వారీగా ఖాళీ స్థలాలు, గనులు, డిపార్టుమెంట్లు, కాలనీల్లో మొక్కలు నాటుతోంది. సింగరేణిలో కొత్త గనుల ఏర్పాటు, విస్తరణ పనులతో చాలా ప్రాంతాల్లో పెద్ద వృక్షాలు, చెట్లతోపాటు కొంతమేర అటవీప్రాంతాన్ని కోల్పోవాల్సి వస్తోంది. దానిని భర్తీ చేసేందుకు యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఎక్కడా ఖాళీ స్థలాన్ని వదలకుండా పచ్చదనం పెంపొందిస్తోంది. డీ గ్రేడ్ ఫారెస్టు భూములను తీసుకుని అడవుల విస్తీర్ణాన్ని పెంచేందుకు కృషి చేస్తోంది. మూసివేతకు గురైన ఓసీపీ ప్రదేశాలు, ఓబీ డంపింగ్ యార్డులపై మొక్కలు నాటి పర్యావరణ సమతౌల్యానికి దోహదపడుతోంది. గతంలో నాటిన మొక్కలు ప్రస్తుతం వృక్షాలుగా మారడంతో మూసివేతకు గురైన గనుల ప్రదేశాలు, డంపింగ్ యార్డులు ప్రస్తుతం అడవులను తలపిస్తున్నాయి.
లక్ష్యం : మూడు లక్షలు
ఈ ఏడాది బెల్లంపల్లి ఏరియాలో సుమారు మూడు లక్షల మొక్కలు సింగరేణి ప్రాంతాల్లో నాటడంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు, అటవీ, ప్రభుత్వ శాఖలకు పంపిణీ చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కైరిగూడ ఓసీపీతోపాటు ఇతర ప్రాంతాల్లో సుమారు 40 హెక్టార్లలో మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. సింగరేణి ఉద్యోగులు నివాసం ఉండే కాలనీలు, రోడ్ల వెంట నాటనున్నారు. చనిపోయిన వాటి స్థానంలో కొత్తవి నాటడంతోపాటు ఎవెన్యూ, బ్లాక్ ప్లాంటేషన్, ఓబీ డంప్‌లో మొక్కలు నాటనున్నారు. కొన్నేళ్లుగా ఏరియాలో సుమారు 5 నుంచి 7లక్షల వరకు మొక్కలు నాటుతున్నారు. వాటిలో ఓబీ డంపింగ్ యార్డుపై నాటుతున్నవే అధికంగా ఉన్నాయి.
సంరక్షణకు ప్రత్యేక చర్యలు
ఏటా రూ.కోట్లు వెచ్చించి నాటుతున్న మొక్కల సంరక్షణపై సింగరేణి ప్రత్యేక దృష్టి సారించింది. ప్రధానంగా రహదారుల వెంట నాటే వాటిని రెండేళ్లుగా సంరక్షిస్తోంది. పశువులకు ఆహారం కాకుండా ట్రీగా ర్డులు ఏర్పాటు చేయడం, రోజు నీళ్లు అందించడం వంటి చర్యలు చేపడుతున్నారు. డంపింగ్ యార్డులపై నాటే వాటి కోసం నల్లతుమ్మ, కంది, జనుము, హమాట గ్రాస్ సీడ్స్, అగీల్ సకారం, సకారం ముంజ, ఎలిఫెంట్, టైగర్ గ్రాస్ విత్తనాలు చల్లుతూ పోషకాలు అందేలా చూస్తున్నారు. తద్వారా భూమి కోతకు గురికాకుండా ఉండటంతోపాటు కావాల్సిన నత్రజని అందుతోంది. డంపింగ్ యార్డులపై నాటిన వాటిల్లో దాదాపు 80శాతం చెట్లుగా మారుతున్నాయి. మిగిలిన 20 శాతం మొక్కల స్థానంలో కొత్తవి నాటుతున్నారు. గతంలో మూతపడిన డోర్లి– 1, డోర్లి– 2 ఓబీ డంపింగ్‌యార్డులు నేడు పచ్చదనంతో కనువిందు చేస్తున్నాయి.
అడవిజాతి మొక్కలే అధికం
సింగరేణి నాటే మొక్కల్లో అడవిజాతివే అధికంగా ఉంటున్నాయి. గోలేటిలో సుమారు 5లక్షల మొక్క ల సామర్థ్యంతో నర్సరీ అందుబాటులో ఉంది. రా వి, మర్రి, వెదురు, తాని, జువ్వి, వేప, సీమచింత, మద్ది, కానుగ, ఎగిస, బహునియా, ఆరె, నారేప, సి సూ, సండ్ర, బిల్వ, ఫీల్ట్‌ఫాం వంటి అడవి జాతి వా టితోపాటు పండ్ల జాతిలో ఉసిరి, చింత, సీమచింత, మామిడి, అల్లనేరేడు, సపోట తదితరవి పెంచుతున్నారు. పండ్ల జాతి వాటిని ఎక్కువగా కాలనీలు, పరిసర గ్రామాల ప్రజలకు పంపిణీ చేస్తున్నారు.

● పర్యావరణ పరిరక్షణకు సింగరేణి యాజమాన్యం ప్రాధాన్యం ● బ