
గిరిజనుల సమగ్రాభివృద్ధికి ‘పీఎం జుగా’
● అదనపు కలెక్టర్ దీపక్ తివారి
తిర్యాణి(ఆసిఫాబాద్): గిరిజనుల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం పీఎం జుగా అమలు చేస్తోందని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండలంలోని పంగిడిమాదర రైతువేదిక వద్ద బుధవారం పీఎం జుగాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గిరిజనులందరూ ఆధార్, కుల, జనన, బ్యాంకు ఖాతా తదితర ధ్రువపత్రాలు కలిగి ఉండే అధికారులు కృషి చేస్తున్నారన్నారు. త్వరలోనే మండలంలోని దివ్యాంగుల కోసం ప్రత్యేక సదరం శిబిరం ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం వివిధ బ్యాంకు అధికారుల సహకారంతో బ్యాంకు ఖాతాలు తెరిపించారు.
మహిళలకు గౌరవం
పీఎం జుగా అవగాహన కార్యక్రమానికి వచ్చి న గిరిజనులకు సరిపడా కుర్చీలు లేకపోవడంతో మహిళలు నేలపై, పురుషులు కుర్చీల్లో కూర్చున్నారు. గమనించిన అదనపు కలెక్టర్ దీపక్ తివారి మహిళలకు కుర్చీలు తెప్పించాలని ఆదేశించారు. అనంతరం అధికారులు మహిళల కోసం ప్రత్యేక కుర్చీలు ఏర్పాటు చేశారు.
అనంతరం అదనపు కలెక్టర్ దీపక్ తివారి మండలంలోని పంగిడిమాదర ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. తరగతి గదుల్లో ఫ్యాన్లు, లైట్లు పనిచేయకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఐటీడీఏ ఏఈ బద్రోద్దీన్‌ను ఆదేశించారు. సరైన నీటి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఉపాధ్యాయులు తెలపగా, త్వరలోనే బోర్‌వెల్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలోని పల్లె దవఖానా భవనాన్ని పరిశీలించి, వారంలోగా పనులు పూర్తి చేయాలని పీఆర్ ఏఈ సువాస్‌ను ఆదేశించారు. ఆయన వెంట డీటీడీవో రమాదేవి, ఎంపీడీవో మల్లేశ్, ఏటీడీవో శ్రీనివాస్, వ్యవసాయ శాఖ అధికారి వినయ్, ఎస్‌సీఆర్పీ యశ్వంత్‌రావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ కృష్ణతేజ, వెటర్నటీ వైద్యుడు సాగర్ తదితరులు ఉన్నారు.