
రైళ్ల రద్దుతో ప్రయాణికుల తిప్పలు
సిర్పూర్(టి): సిర్పూర్(టి) రైల్వేస్టేషన్ మీదుగా ప్రతీరోజు రాకపోకలు సాగించే రైళ్లబంద్‌తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిర్పూర్(టి) రైల్వేస్టేషన్ నుంచి ఖాజీపేట్, కరీంనగర్, బల్లార్షా తదితర పట్టణాలకు ప్రయాణించే రామగిరి ప్యాసింజర్, సింగరేణి ప్యాసింజర్, పుష్పుల్ ప్యాసింజర్ రైళ్లు పూర్తిగా రద్దయ్యాయి. సిర్పూర్(టి) రైల్వేస్టేషన్ నుంచి సిర్పూర్(టి), కౌటాల, బెజ్జూర్, చింతలమానెపల్లి మండలాల ప్రజలతో పాటు సమీపంలోని మహారాష్ట్ర గ్రామాల ప్రజలు ప్రతీరోజు మంచిర్యాల, కరీంనగర్, హైదరాబాద్, నిజామాబాద్ పట్టణాలతో పాటు మహా రాష్ట్రలోని బల్లార్షా, చంద్రపూర్, నాగ్‌పూర్ తదితర పట్టణాలకు ప్రయాణాలు సాగిస్తుంటారు. ఈనెల 21 నుంచి 26 వరకు సిర్పూర్(టి) రైల్వేస్టేషన్ నుంచి కొనసాగించే రైళ్లు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధి కారులు ప్రకటించడంతో ప్రయాణికులు సమీపంలోని కాగజ్‌నగర్ పట్టణం వరకు ప్రైవేటు వాహనాల్లో చేరుకుని ప్రయాణాలు సాగించాల్సి వస్తోంది. రైల్వే మూడవ లైన్ మరమ్మతులు, ఇతర మరమ్మతుల కారణంగా ఖాజీపేట్ –బల్లార్షా మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లను తరుచూ రద్దు చేస్తుండటంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. నెలకోసారి రైళ్లు రద్దు చేస్తుండటంతో అసలు రైళ్లు కొనసాగుతున్నాయా..? లేదా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివిధ గ్రామాల్లోని ప్రజలకు రైళ్ల రద్దు సమాచారం లేకపోవడంతో రైల్వేస్టేషన్ వరకు వచ్చి వారు వెనుదిరిగి వెళ్లాల్సి వస్తుంది. రైల్వే అధికారులు స్పందించి రైళ్లు యథావిధిగా క్రమంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నా రు.