
ప్రవేశాల్లో వెనుక‘బడి’..
● జిల్లాలో ఫలితమివ్వని ‘బడిబాట’
● లక్ష్యం 7,093.. అడ్మిషన్లు 2,079
● తెరుచుకున్న ఏడు ‘మూత’బడులు
ఆసిఫాబాద్‌రూరల్: విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడిబాట కార్యక్రమం అధికారులు అనుకున్న లక్ష్యం చేరుకోలేకపోయింది. ప్రతీ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. సరైన సౌకర్యాలు లేక, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల లేక చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపుతుండడమే కారణం.
కొత్త అడ్మిషన్లు 2,079 మాత్రమే..
2025–26 విద్యాసంవత్సరంలో ఈ నెల 6నుంచి 19వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో అంగన్‌వాడీ కేంద్రాలు, ఆవాస ప్రాంతాల నుంచి ఐదేళ్లు నిండిన 2,079 మంది బాలలు సర్కారు బడుల్లో ఒకటో తరగతిలో ప్రవేశాలు పొందారు. గతేడాది ఒకటో తరగతిలో 4,009 మంది ప్రవేశాలు తీసుకోగా ఈసారి ఆ సంఖ్య సగానికి పడిపోయింది. ప్రైవేట్ పాఠశాలల నుంచి 324 మంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. రెండోతరగతి నుంచి 10వ తరగతి వరకు 849 మంది ప్రవేశాలు పొందారు. జిల్లాలో నిర్వహించిన సర్వే ప్రకారం 7,093 మంది ఐదేళ్లు పూర్తి చేసుకున్న బాలలు ఒకటో తరగతిలో చేరాల్సి ఉండగా 2,079 మంది మాత్రమే ప్రవేశాలు తీసుకున్నారు. లక్ష్యం పూర్తి చేయాలంటే ఇంకా 5,014 మందిని చేర్చాల్సి ఉంది. అలాగే గతంలో విద్యార్థుల సంఖ్య లేని కారణంగా జిల్లా వ్యాప్తంగా 36 పాఠశాలలు మూతబడ్డాయి. బడిబాట సందర్భంగా జిల్లాలో ఏడు పాఠశాలలు తెరుచుకున్నాయి. ఆసిఫాబాద్ మండలంలోని కొమ్ముగూడ, రింగన్‌గూడ, గొల్లగూడ, బాబాపూర్ తండా, కాగజ్‌నగర్ మండలంలోని వల్లకొండ, సిర్పూర్(టి) మండలంలోని రావణ్‌పల్లి, వాంకిడిలోని దేవాపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను తెరిపించారు. మిగతా 29 పాఠశాలలు తెరిపించేందుకు చర్యలు చేపట్టాల్సి ఉంది.