మందమర్రిరూరల్: తల్లి మెడలోని రెండు తులాల బంగారు గొలుసు దొంగిలించిన కుమారుడిని మందమర్రి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. బుధవారం మందమర్రి సర్కిల్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ శశిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ హాజరై వివరాలు వెల్లడించారు. పట్టణంలోని రైల్వేస్టేషన్ రోడ్డు వైపు నివాసం ఉండే విజయపురి పుల్లమ్మ అనే వృద్ధురాలు గత నెల 24న అనారోగ్యంతో బాధపడుతూ మంచం పట్టింది. ఈక్రమంలో గుర్తు తెలియని వ్యక్తి పుల్లమ్మ మెడలో గొలుసు దొంగిలించినట్లు మనుమడు శివ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉన్నతాధికారుల సూచనలు, సాంకేతికత ఆధారంగా ఇంటి వారే దొంగతనం చేసి ఉంటారనే కోణంలో పుల్లమ్మ కుమారుడు శంకరయ్యపై నిఘా ఉంచారు. ఆయన అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో విచారించగా ఆర్థిక ఇబ్బందుల వల్ల తానే దొంగిలించినట్లు నేరం అంగీకరించాడు. ఈ మేరకు శంకరయ్య వద్ద నుంచి రెండు తులాల బంగారు గొలుసును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ పేర్కొన్నారు. చాకచక్యంగా నిందితుడిని పట్టుకున్న ఎస్సై రాజశేఖర్, క్రైంటీం కానిస్టేబుళ్లు మహేశ్, రాకేశ్‌లను ప్రత్యేకంగా అభినందించారు.