
ధ్రువపత్రాలు పరిశీలిస్తున్న అధికారులు
● 50 యూనిట్లకు 752 దరఖాస్తులు ● పలువురి దరఖాస్తులు గల్లంతు.. అయోమయంలో దరఖాస్తు దారులు ● బ్యాంకు, మున్సిపల్ అధికారుల తీరుపై నిరసన
కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో మైనార్టీ వర్గానికి చెందిన ప్రజలకు మైనార్టీ కార్పొరేషన్ నుంచి అందించాల్సిన సబ్సిడీ రుణాల కోసం బుధవారం కాగజ్‌నగర్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. అయితే ఇంటర్వ్యూల ప్రక్రియ నామమాత్రంగా సాగిందని పలువురు దరఖాస్తుదారులు పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో 50 యునిట్ల రుణాలు మంజూరు కోసం 752 మంది మూడు నెలల క్రితమే దరఖాస్తు చేసుకున్నారు. ప్రతీ యూనిట్‌కు రూ.లక్ష, రూ.2 లక్షల చొప్పున కేటాయించడంతో పెద్దఎత్తున దరఖాస్తులు వచ్చా యి. ఎంతో మంది గంపెడాశలతో ఇంటర్వ్యూలకు హాజరైనా బ్యాంకు అధికారులు, మైనార్టీ కార్పొరేషన్, బల్దియా అధికారుల నుంచి స్పందన లభించకపోవడంపై వారు నిరసన తెలిపారు. కేంద్ర సహకార బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంకు, ఐఓబీ బ్యాంకు తదితరు బ్యాంకుల నుంచి మేనేజర్లు, ఫీల్డ్ ఆఫీసర్లు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహించారు. మరోవైపు పలువురి దరఖాస్తులు గల్లంతు కావడంతో కొంత మంది ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం అధికారుల సూచన మేరకు మళ్లీ దరఖాస్తులు అందజేశారు. మొదట 25 యూనిట్లు మాత్రమే ఉండగా మంగళవారం రాత్రి మరో 25 యూనిట్లను మంజూరు చేస్తూ మైనార్టీ కార్పొరేషన్‌కు ఉత్తర్వులు అందాయి. దీంతో మొత్తం 50 యూనిట్లకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అంజయ్య, జిల్లా మైనార్టీ అధికారి రబ్బానీ, మెప్మా ప్రతినిధులు మోతీరాం, ఉష తదితరులు పాల్గొన్నారు.