
ఆసిఫాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి విద్యాశాఖ కార్యదర్శి దేవసేన, ఉన్నతాధికారులతో కలిసి వార్షిక పరీక్షల నిర్వహణపై కలెక్టర్లు, డీఈవోలు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వచ్చే నెల 3 నుంచి 13 వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు కొనసాగుతాయని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ హేమంత్ బోర్కడే మాట్లాడుతూ జిల్లాలో పరీక్షల నిర్వహణకు 39 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 7,151 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని పేర్కొన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని స్పష్టం చేశారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని, అలాగే వైద్యసిబ్బందిని నియమించినట్లు తెలిపారు. కేంద్రాల వద్ద నిఘా కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు పరీక్ష సమయం కంటే ముందే కేంద్రాలకు చేరుకునే విధంగా ఆర్టీసీ బస్సులు, ఇతరవాహనాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పరీక్షల సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించామని వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ సురేశ్‌కుమార్, అదనపు కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, డీఈవో అశోక్, అదనపు ఎస్పీ అచ్చేశ్వర్‌రావు, ఆర్డీవో రాజేశ్వర్, డీపీవో రమేశ్, పరీక్షల కోఆర్డినేటర్ ఉదయ్‌బాబు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
అధికారులతో వీడియో కాన్ఫరెన్స్