ఫలం.. పోషకాలు పుష్కలం

 పోషకాలను ఇచ్చే పండ్లు
 - Sakshi

● రోజా విరమణలో వినియోగం ● రంజాన్‌ మాసంలో ప్రత్యేకం

నెన్నెల(బెల్లంపల్లి): రంజాన్‌ మాసం వచ్చిందంటే పండ్లకు భలే గిరాకీ ఉంటుంది. ఇఫ్తార్‌ దీక్ష విరమణకు ముస్లింలు ఎక్కువగా పండ్లనే ఇష్టపడుతారు. ఎందుకంటే వాటిలో పోషకాలు అధికంగా ఉండడమే కారణం. సుమారు 15 గంటల పాటు ఉపవాసం ఉండి సాయంత్రం దీక్ష విరమణ సమయంలో పోషకాలు అధికంగా ఉండే ఫలాలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు పేర్కొంటున్నారు. తాజా పండ్లతో పాటు డ్రై ఫ్రూట్స్‌ తీసుకోవాలని సూచిస్తున్నారు.

పోషకాల ఖర్జూర..

ఖర్జూరలో తక్షణ శక్తినిచ్చే పోషకాలు ఉంటాయి. మహ్మద్‌ ప్రవక్త రంజాన్‌ ఉపవాస దీక్ష విరమణ సమయంలో వీటినే ఎక్కువగా తీసుకునే వారు. చాలా మంది సున్నత్‌(మహ్మద్‌ ప్రవక్త ఆచారం)లో భాగంగా ముందుగా ఖర్జూర పండ్లతోనే ఉపవాసదీక్షలు విరమిస్తారు. ఆ తర్వాతే ఇతర ఫలాలు తింటారు. ఈ క్రమంలో వాటి గిరాకీని తట్టుకునేందుకు రంజాన్‌ మాసంలో వ్యాపారులు విదేశాల నుంచి కూడా మేలు రకమైన ఖర్జూరను దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నారు. ఇందులో విటమిన్‌లు బీ–1, బీ–2, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి.

శక్తినిచ్చే ఎండుఫలం

ఎండుఫలాలు మంచి శక్తినిస్తాయి. సౌదీలో ఎండు ఫలాలు అధికంగా లభిస్తాయి. మహ్మద్‌ ప్రవక్త దీక్ష విరమణ కోసం ఎండుఫలాలైన ఖర్జూర, కాజు, బాదం, పిస్తా, అక్రోట్‌లను అధికంగా తినేవారని చరిత్ర చెబుతోంది. ఈ ఎండు ఫలాల్లో అధిక పోషకాలు ఉంటాయి. దీంతో ముస్లింలు రోజా విరమణ కోసం ఇఫ్తార్‌లో వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. తర్బూజ, కర్బూజ, బత్తాయి, ద్రాక్ష, సంత్రాలలో దాహం తీర్చే గుణాలు ఉంటాయి. విటమిన్లు, పీచు పదార్థాలు ఉంటాయి. అరటిలో విటమిన్‌–ఏ, కాల్షియం ఉంటాయని వైద్యులు పేర్కొంటున్నారు.

రోజా విరమణకు ఖర్జూర శ్రేష్ఠం

మహ్మద్‌ ప్రవక్త ఖర్జూర పండుతోనే రోజా విరమణ చేసే వారని ఖురాన్‌లో పేర్కొన్నారు. వీటిలో బీ–1, బీ–2, కాల్షియం, పోషక విలువలు మెండుగా ఉంటాయి. అందుకే వివిధ దేశాల్లో రోజు విరమణకు ముందుగా ఖర్జూరనే ఉపయోగిస్తారు.

– మహ్మద్‌ ఇబ్రహీం ఖాద్రి

డీహైడ్రేషన్‌ దూరం

రోజుకు సుమారు 15 గంటల పాటు అన్నపానియాలు ముట్టుకోకుండా కఠిన ఉపవాస దీక్ష ఉంటుంది. రోజా విరమణ సమయంలో పండ్లు తీసుకుంటే శక్తితో పాటు శరీరానికి కావాల్సిన నీటిశాతం అందుతుంది. ఇఫ్తార్‌లో పండ్లు తీసుకుంటే ఆహారం సులువుగా జీర్ణమవుతుంది. డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండేందుకు ఉపవాస దీక్ష విరమణకు పండ్లు తీసుకుంటారు. – యూనిస్‌ రజాఖాద్రి హఫీజ్‌, బెల్లంపల్లి

Read latest Komaram Bheem News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top