అభివృద్ధి బాధ్యత నాదే.. | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి బాధ్యత నాదే..

Dec 3 2025 7:53 AM | Updated on Dec 3 2025 7:53 AM

అభివృ

అభివృద్ధి బాధ్యత నాదే..

ప్రపంచ స్థాయికి యూనివర్సిటీ : భట్టి ఎయిర్‌పోర్ట్‌ కావాలి : తుమ్మల హమీలన్నీ అమలు చేస్తున్నాం : పొంగులేటి

ఖమ్మం మంత్రుల నాయకత్వంలోనే ప్రభుత్వం

డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ ఎర్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీని ప్రారంభించిన సీఎం

షెడ్యూల్‌ కంటే రెండు గంటలు ఆలస్యంగా రాక

కొత్త యూనివర్సిటీ దేశానికే తలమానికం అన్న మంత్రులు

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడె/ కొత్తగూడెం అర్బన్‌ : ‘ఉమ్మడి ఖమ్మం జిల్లాను చూసినప్పుడు నా గుండెలో సంతోషం ఉంటుంది. ఎన్నిసార్లు వచ్చినా అదే ఉత్సాహం కనిపిస్తుంటుంది. అదే ఊపుతో మీరు నాకు అండగా నిలబడితే, మీరు చూపించే ఉత్సాహాన్నే ఊపిరిగా తీసుకొని తెలంగాణను అగ్రభాగాన నిలబెడతా. భద్రాద్రి రాములవారి సాక్షిగా ఖమ్మం జిల్లాను అభివృద్ధిపథం వైపు నడిపించే బాధ్యత నాదే’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ ఎర్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీని మంగళవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా తాను ఉన్నప్పటికీ కీలక మంత్రిత్వ శాఖలన్నీ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మల్లు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గరే ఉన్నాయని చెప్పారు. వారు అనుకుంటే జరగని పనంటూ ప్రభుత్వంలో ఏదీ లేదన్నారు. ‘మీ మంత్రులు అడిగిందే తడవుగా అన్ని పనులు మంజూరు చేస్తా’ అని హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులే నాయకత్వం వహిస్తున్నందున ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డులు, సన్నబియ్యం వంటి పథకాలన్నీ ఇక్కడి నుంచే ప్రారంభించామని చెప్పారు. సాంకేతిక కారణాల వల్ల కొత్తగూడెం రావడం ఆలస్యమైందని, కానీ ఢిల్లీలో మరో పని ఉన్నందున వెంటనే వెళ్లిపోతున్నానని చెప్పారు. మరోసారి ఇక్కడికి వస్తానని, అప్పుడు అన్ని విషయాలు వింటానని హామీ ఇచ్చారు.

దివంగత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పేరు పెట్టిన యూనివర్సిటీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ యూనివర్సిటీని దేశంలోనే అత్యున్నత విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన భవనాలు, ఇతర సౌకర్యాలు సకాలంలో పూర్తి చేస్తామన్నారు. పూర్తిస్థాయి ఎర్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ దేశంలో ఇప్పటివరకు ఎక్కడా లేదని తెలిపారు. ఎర్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ ద్వారా భూమి, భూమి లోపల ఉన్న పొరలు, ఖనిజాలు, భూమి చుట్టూ ఉన్న అనేక అంశాల పైన పరిశోధనలు చేయడమే కాకుండా దేశానికి, ప్రపంచానికి విజ్ఞానాన్ని అందించే అవకాశం ఉంటుందని వివరించారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న అత్యున్నత యూనివర్సిటీని సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రారంభించుకోవడం హర్షణీయమని అన్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బీడు భూములకు సీతారామ జలాలను పారించేందుకు అసరమైన నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. అలాగే కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టు, థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేయాలన్నారు. ఎర్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీని జిల్లాకు మంజూరు చేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీ అమలు దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పేదవారికి భరోసా, అండగా నిలవాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ప్రజల మద్దతు, దీవెనలు కొనసాగితే మరింత వేగంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతాయని, ఎర్త్‌ సైన్సెస్‌ వంటి యూనివర్సిటీలు భవిష్యత్‌లో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.

రెండు గంటలకు పైగా ఆలస్యం

ఎర్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీని మంగళవారం కొత్తగూడెంలో సీఎం రేవంత్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఆయన పర్యటనను పురస్కరించుకుని వారం రోజులుగా వర్సిటీ క్యాంపస్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. షెడ్యూల్‌ ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు సీఎం క్యాంపస్‌కు రావాల్సి ఉంది. కానీ సాంకేతిక కారణాలతో రెండు గంటలకు పైగా ఆలస్యమైంది. దీంతో ఈ బహిరంగ సభ కోసం వచ్చిన మహిళలు చాలా మంది సభ ప్రారంభం కాకముందే వెళ్లిపోగా.. 25 వేల మందికి సరిపడా సీటింగ్‌ కెపాసిటీ కలిగిన సభా ప్రాంగణంలో వెనుక భాగంలో కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. అయితే, వివిధ స్కూళ్లు, కాలేజీల నుంచి వచ్చిన విద్యార్థులు సాయంత్రం ఐదు గంటల వరకు ఓపికగా ఎదురుచూశారు. సభ ప్రారంభమైన తర్వాత హుషారుగా ఈలలు వేస్తూ సభా ప్రాంగణంలో జోష్‌ నింపారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కళాకారులు నిర్విరామంగా ఆడిపాడుతూ సభికులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి వాకిటి శ్రీహరి, ఖమ్మం, మహబూబాబాద్‌ ఎంపీలు రామసహాయం రఘురాంరెడ్డి, పోరిక బలరాం నాయక్‌, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, రాందాస్‌ నాయక్‌, మట్టా రాగమయి, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, జారె ఆదినారాయణ, అదనపు కలెక్టర్లు విద్యా చందన, వేణుగోపాల్‌, ట్రెయినీ కలెక్టర్‌ సౌరభ్‌శర్మ, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ పొదెం వీరయ్య, ఆర్డీఓ మధు, ప్రిన్సిపాల్‌ జగన్మోహన్‌ రాజు, అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

భద్రాద్రి రాముడి సాక్షిగా మాట ఇస్తున్నా

అభివృద్ధి బాధ్యత నాదే..1
1/2

అభివృద్ధి బాధ్యత నాదే..

అభివృద్ధి బాధ్యత నాదే..2
2/2

అభివృద్ధి బాధ్యత నాదే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement