రెండో విడతకూ పోటాపోటీ
అంతటా హడావుడి
● చివరి రోజున భారీగా నామినేషన్ల దాఖలు ● మొదటి దశకు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు ● మూడో దశకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ● ఎంపిక, ఏకగ్రీవాలు, ఉపసంహరణలపై పార్టీలు బిజీబిజీ
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రెండో దశ గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. జిల్లాలోని ఆరు మండలాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటా పోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి రెండు రోజులతో పోలిస్తే చివరి రోజున పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలు కాగా, కొన్ని జీపీల్లో రాత్రి పొద్దుపోయే వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగింది. ఇక మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారంతో ముగియనుండగా బరిలో మిగిలిన అభ్యర్థుల సంఖ్య తేలుతంది. మరోవైపు మూడో విడత ఎన్నికలు జరిగే ఏడు మండలాల్లోని 191 జీపీలు, 1,742 వార్డులకు బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలుకానుంది.
183 జీపీలు.. 1,686వార్డులు
రెండో విడతలో కామేపల్లి, ఖమ్మంరూరల్, కూసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాల్లోని 183 సర్పంచ్, 1,686 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ ఆదివారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా.. మొదటి రోజు సర్పంచ్ స్థానాలకు 45, వార్డులకు 36 నామినేషనన్లు దాఖలయ్యాయి. రెండో రోజైన సోమవారం సర్పంచ్‌లుగా 383, వార్డులకు 895 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇక చివరి రోజైన మంగళవారం కూడా భారీగానే నామినేషన్లు దాఖలైనా కొన్నిచోట్ల రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగడంతో సంఖ్యపై స్పష్టత రాలేదు. దాఖలైనట్లయింది. మొదటి, రెండో విడత నామినేషన్ల స్వీకరణ ప్రశాంత వాతావరణంలో ముగిసేలా పోలీస్ బందోబస్తు నిర్వహించడంతో ఎక్కడా అవాంతరాలు ఎదురుకాలేదు.
నేడు ఉపసంహరణలకు ఆఖరు
మొదటి విడత ఎన్నికలు జరిగే కొణిజర్ల, రఘునాథపాలెం, వైరా, బోనకల్, చింతకాని, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో నామినేషన్ల ఉపసంహరణలపై పార్టీలు దృష్టి పెట్టాయి. బుధవారం మధ్యాహ్నం 3గంటలకు ఉపసంహరణ గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యాన ఎంపిక చేసిన అభ్యర్థి మినహా మిగతా వారితో నామినేషన్ విత్‌డ్రా చేయించేలా నాయకులు చర్చలు జరుపుతున్నారు. కొందరు మాత్రం పట్టు వీడకుండా, ఇప్పుడు కాకపోతే తమకు ఎప్పుడు అవకాశం వస్తుందంటూ ప్రశ్నిస్తున్నారు. అయినప్పటికీ బుజ్జగించే ప్రయత్నాలు చేస్తూనే ఎమ్మెల్యేలు, జిల్లాస్థాయి నేతలతో చెప్పిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఉపసంహరణలపై ఎక్కువగా దృష్టి సారించాయి. బుధవారం మధ్యాహ్నం 3గంటల తర్వాత బరిలో నిలిచే అభ్యర్థుల జాబితా వెల్లడికానుంది.
ఇకపై తుది విడత
జిల్లాలో మూడో విడత ఎన్నికలు జరిగే మండలాల్లో బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, వేంసూరు, సింగరేణి మండలాల్లోని 191 గ్రామపంచాయతీలు, 1,742 వార్డులకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలుకు సిద్ధమవుతున్నారు. ఈనెల 5వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉండగా, 9న మధ్యాహ్నం మూడు గంటల్లోగా ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ దశ జీపీల్లో ఎన్నికలు ఈనెల 17న నిర్వహిస్తారు.
గ్రామపంచాయతీల్లో ఎన్నికల హడావుడి నెలకొంది. రాజకీయ పార్టీల నేతలు తాము మద్దతునిచ్చే అభ్యర్థుల ఎంపికతోపాటు నామినేషన్ల ఉపసంహరణ, ప్రచారం, గెలుపోటముల వ్యూహరచనలో తీరికలేకుండా గడుపుతున్నారు. గ్రామస్థాయిలో పట్టు ఉండి.. సర్పంచ్‌లుగా గెలుపొందే అభ్యర్థులను ఎంపిక చేయడం, ఆ స్థానాన్ని ఆశిస్తున్న ఇతరులకు నచ్చజెప్పడం కొనసాగుతోంది. ఎవరైనా మాట వినకపోతే మంతనాలు జరుపుతూనే మద్దతుదారులను గెలిపించుకునేందుకు ప్రచార వ్యూహాలు రూపొందిస్తున్నారు. అధికార కాంగ్రెస్‌పార్టీతోపాటు బీఆర్‌ఎస్, కమ్యూనిస్టులు కూడా ఎన్నికలపై పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తుండగా, అందరూ మొదటి విడత ఎన్నికల్లో ఉపసంహరణలపై దృష్టి కేంద్రీకరించారు.


