వైరా రిజర్వాయర్‌లో చేపపిల్లలు విడుదల
వైరా: రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న చేపపిల్లలను మంగళవారం వైరా రిజర్వాయర్‌లో విడుదల చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా మత్స్య శాఖాధికారి జి.శివప్రసాద్ మాట్లాడుతూ ఉచిత చేప పిల్లల పంపిణీతో మత్స్యకారులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. జలవనరుల శాఖ ఏఈ వెంకటరాము, మత్స్యకారుల సంఘం ఆధ్యక్షుడు షేక్ రహీమ్‌తో పాటుషేక్ జానీమియా, షేక్ ఉద్దండు, జ్ఞానరత్నం, రామారావు చాంద్‌మియా తదితరులు పాల్గొన్నారు.
పారదర్శకంగా
పంటల నమోదు
వైరారూరల్: రైతులు సాగు చేస్తున్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలను పారదర్శకంగా నమోదు చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ధనసరి పుల్లయ్య సూచించారు. మండలంలోని అష్టగుర్తిలో మంగళవారం ఆయన పంటల నమోదును పరిశీలించి ఉద్యోగులకు సూచనలు చేశారు. అనంతరం డీఏఓ మాట్లాడుతూ మొక్కజొన్న సాగు చేసే రైతులు కంపెనీ నిర్వాహకులతో అగ్రిమెంట్ చేసుకోవాలని, వరి కోతలు ముగిశాక కొయ్యలను కాల్చకుండా పొలంలోనే కలియదున్నాలని సూచించారు. ఏడీఏ తుమ్మలపల్లి కరుణశ్రీ, ఏఓ మయాన్ మంజుఖాన్, ఏఈఓ ఆలూరి వాసంతి, రైతులు పాల్గొన్నారు.
సీసీఐ పత్తి కొనుగోళ్లు తనిఖీ
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలోని ఎంపిక చేసిన జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ ద్వారా జరుగుతున్న పత్తి కొనుగోళ్లను జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఎం.ఏ.అలీం మంగళవారం తనిఖీ చేశారు. ఖమ్మం, మద్దులపల్లి మార్కెట్ల పరిధిలోని మిల్లుల్లో తనిఖీ చేసిన ఆయన ఇప్పటివరకు కొనుగోలు చేసిన పత్తి, రికార్డులను పరిశీలించారు. అలాగే, బ్యాంకు ఖాతాల్లో నగదు జమపై రైతులతో మాట్లాడారు. ఖమ్మం మార్కెట్ సహాయ కార్యదర్శి పోలవరపు వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
సైబర్ మోసాలపై
అప్రమత్తంగా ఉండాలి
ఖమ్మంక్రైం: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయనే తదితర ఆకర్షణీయమైన ప్రకటనలతో సైబర్ నేరగాళ్లు పన్నుతున్న ఉచ్చులో చిక్కుకుని ప్రజలెవరూ మోసపోవద్దని సీపీ సునీల్‌దత్ సూచించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యాన ‘ఫ్రాడ్ కా పుల్ స్టాప్’ పేరుతో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు జిల్లాలో మంగళవారం మొదలయ్యాయని తెలిపారు. మైక్‌ల ద్వారా రైల్వేస్టేషన్లు, బస్టాండ్, రద్దీ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు. అలాగే, డిజిటల్ అరెస్టుల పేరుతో జరుగుతున్న మోసాలపై జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఎవరైనా వీడియోకాల్, వాట్సాప్ లేదా మెసేజ్ ద్వారా పెట్టుబడి పెట్టమని ఒత్తిడి చేస్తే కాల్ కట్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సీపీ సూచించారు. కాగా, ‘ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్’లో భాగంగా పోలీస్ శిక్షణ కేంద్రంలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఇందులో అడిషనల్ డీసీపీ రామానుజం మాట్లాడగా సైబర్ క్రైమ్ ఏసీపీ ఫణిందర్, సీఐ నరేష్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
వైరా రిజర్వాయర్‌లో చేపపిల్లలు విడుదల
వైరా రిజర్వాయర్‌లో చేపపిల్లలు విడుదల
వైరా రిజర్వాయర్‌లో చేపపిల్లలు విడుదల


