
దేశవ్యాప్త సమ్మెతో కేంద్రానికి కనువిప్పు
ఖమ్మంమయూరిసెంటర్: ఈనెల 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు, రైతులు, వ్య వసాయ కూలీలు పాల్గొని జయప్రదం చేయాలని.. తద్వారా ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. ఖమ్మంలోని సుందరయ్య భవనంలో శుక్రవారం ప్రజాసంఘాల ఐక్యవేదిక సమావేశం కళ్యాణం వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో తమ్మినేని మాట్లాడుతూ మోడీ పాలనలో పదేళ్లుగా స్వదేశీ, విదేశీ పారిశ్రామికవేత్తల ఆర్థిక ప్రయోజనాల కోసం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తెచ్చారన్నారు. ఫలితంగా పని గంటలు, పనిభారం పెరగడమే కాక యూనియన్లు పెట్టుకునే హక్కు కోల్పోవాల్సి వస్తోందని చెప్పారు. అంతేకాక కనీస వేతనాలు, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న తీర్పులను బుట్టదాఖలు చేస్తుండగా, కార్మిక సంక్షేమం, సాంఘిక భద్రత, ఉపాధి, ఉద్యోగ రక్షణ కరువవుతున్నాయని తెలిపారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా 9వ తేదీన జరిగే సమ్మెను జయప్రదం చేయాలని వీరభద్రం పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్‌రావు, నాయకులు నున్నా నాగేశ్వరరావు, పొన్నం వెంకటేశ్వరావు, బుగ్గవీటి సరళ, మాదినేని రమేష్, బొంతు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు
తమ్మినేని వీరభద్రం