ఉద్రిక్తంగా శ్రీరంగపట్టణం
భక్తులను అదుపుచేస్తున్న పోలీసులు
హనుమాన్ శోభాయాత్ర
మండ్య: ఆంజనేయస్వామి మాలధారులు, భక్తులు చేపట్టిన సంకీర్తన యాత్ర ఉద్రిక్తంగా మారింది. ఊరేగింపు సందర్భంగా శ్రీరంగపట్టణం పురసభ సర్కిల్ వద్ద ప్రార్థనాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు మాలధారులు యత్నించారు. ఈ సమయంలో వారిని పోలీసులు అడ్డుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వివరాలు.. బుధవారం శ్రీరంగపట్టణంలోని వేలాది మంది హనుమ మాలధారులు సంకీర్తన యాత్రను చేపట్టారు. పట్టణ శివార్లలోని గంజాం కావేరి నది సరిహద్దులో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో హిందూ నాయకుడు లోహిత్ రాజ్ అరస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని మూడల బాగిలు ఆంజనేయ స్వామి దేవాలయానికి ఊరేగింపుగా సాగారు. ఊరేగింపు పొడవునా జైశ్రీరామ్, భజరంగ భజరంగ’ నినాదాలు చేస్తూ సాగారు.
అక్కడ అలజడి
ఊరేగింపు యాత్ర పట్టణ పురసభ సర్కిల్ వద్దకు చేరుకోగా అలజడి చెలరేగింది. అక్కడ ప్రార్థనాలయం ఉంది. ముందు రోడ్డుపై టెంకాయలు కొట్టి కర్పూర హారతులు ఇచ్చి నిమ్మకాయలు ఉంచారు. రోడ్డుపై కూర్చొని రామ, ఆంజనేయ స్వామి భజనలు చేశారు. కొందరు భక్తులు ఆవేశం పట్టలేక ప్రార్థనాలయం తమదని చెబుతూ అక్కడ మందిరం కట్టి తీరుతామని వీరంగం చేశారు. లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. వెంటనే పోలీసులు వారిని అడ్డుకుని రోడ్డు పక్క నుంచి వెళ్లాలని సూచించారు. ఈ క్రమంలో తోపులాట, వాగ్వాదంతో ఉద్రిక్తత రాజ్యమేలింది. వేలాది మంది పోలీసులను మసీదు వద్ద భద్రతగా ఉంచినా కూడా హనుమ భక్తులు ఆగలేదు. ఎస్పీ మల్లికార్జున బాలదండి భక్తులకు సర్దిజెప్పారు. గొడవలు జరగకుండా ముందుగానే 1800 మంది పోలీసులను మోహరించారు. పలువురు హిందూ సంఘాల నాయకులు మాట్లాడుతూ శ్రీరంగపట్టణ హిందువుల పవిత్రస్థలమని, గతంలో ఇక్కడ ఒక దేవస్థానాలు ఉండేవన్నారు. దండయాత్రలకు గురై ధ్వంసమయ్యాయని ఆరోపించారు. ఇందులో మూడల బాగిలు ఆంజనేయ స్వామి దేవాలయం ఒకటని చెప్పారు.
భారీఎత్తున హనుమాన్ భక్తుల ర్యాలీ
ప్రార్థనాలయం ముందు రభస
ఉద్రిక్తంగా శ్రీరంగపట్టణం
ఉద్రిక్తంగా శ్రీరంగపట్టణం


