డీకే ఆకస్మిక ఢిల్లీ టూర్
శివాజీనగర: రాజకీయ వేడి మధ్య డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా ఇంటి వద్ద మీడియాతో మాట్లాడుతూ 14న ఓట్ చోరీపై ఆందోళన ఉంది, ప్రతి జిల్లా నుంచి 300 మందిని తీసుకొని వెళ్లాలి. ఢిల్లీ పర్యటన పూర్తిగా ప్రైవేట్ వ్యవహారమన్నారు. మంగళూరులో కేసీ వేణుగోపాల్, సిద్దరామయ్య భేటీ జరిగితే తప్పేముందన్నారు. అభిమానులు నినాదాలు చేసి ఉండవచ్చు, కొందరు మోదీ అంటారు, కొందరు డీకే అంటారు, కొందరు రాహుల్ అంటారు, కొందరు సిద్దు అంటారు, అందులో తప్పేమిటని ప్రశ్నించారు.
ఆ వాచ్ నాదే
విలువైన వాచ్ ఆరోపణల మీద స్పందిస్తూ అల్పాహార విందులో నేను కట్టిన వాచ్ ధర రూ.43 లక్షలుగా వార్తలు వచ్చాయి. అది రూ.24 లక్షలే, నేనే క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసిన వాచ్ అని అన్నారు. నేను, సిద్దరామయ్య గడియారాలను కొనుగోలు చేయరాదా?, మాకా శక్తి లేదా? అని ప్రశ్నించారు. శివకుమార్ ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలను కలవవచ్చని తెలుస్తోంది. అల్పాహార విందు, సీఎం కుర్చీ, మంత్రిమండలి మార్పులు, ఇతర రాజకీయ పరిణామాలను వారికి వివరించే వీలుంది.


