తేరుపై హనుమంతుడు
బొమ్మనహళ్లి: బొమ్మనహళ్ళి నియోజకవర్గంలోని బన్నేరుఘట్ట రోడ్డులో ఉన్న అరికెరెలో ప్రసిద్ధ వీరాంజనేయ స్వామివారి బ్రహ్మరథోత్సవం వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. మంగళవారం హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు అందుకున్న వీరాంజనేయ స్వామివారికి మరుసటి రోజు తేరు వేడుక జరపడం సంప్రదాయం. ఎమ్మెల్యే ఎం.సతీష్ రెడ్డి రథానికి పూజలు నిర్వహించారు. వేలాది భక్తులు జై హనుమాన్, జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తూ తేరును లాగారు.
కానిస్టేబుల్ వంచన
మైసూరు: పేపర్ గ్లాస్, జ్యూస్ తయారీ విభాగం ప్రారంభిస్తానని నమ్మించి పోలీసు కానిస్టేబుల్ ఒకరు దంపతుల నుంచి రూ. 35 లక్షలను దండుకున్నాడు. మైసూరు మేటగళ్లి ఠాణా కానిస్టేబుల్ రాజుపై కువెంపు నగర నివాసి మంజుళా జైన్, సిద్ధేశ్, మహాలక్ష్మి కృష్ణరాజ ఠాణాలో ఫిర్యాదు చేశారు. మంజుళకు పేపర్ గ్లాస్, జ్యూస్ తయారీ కేంద్రం ఏర్పాటుకు ఆర్థిక సాయం చేయిస్తానని రాజు నమ్మించాడు. ఆమె ద్వారా సిద్ధేశ్ దంపతులను పరిచయం చేసుకున్నాడు. వారి నుంచి రూ. 35 లక్షలను తీసుకుని ముఖం చాటేశాడు. అడిగితే చేతనైంది చేసుకోండి అని ఎదురుదాడికి దిగతున్నాడని బాధితులు వాపోయారు.
42 ఇండిగో విమానాల రద్దు
● ప్రయాణికుల అవస్థలు
దొడ్డబళ్లాపురం: కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో ఏకంగా 42 ఇండిగో విమానాలు హఠాత్తుగా రద్దు చేయడంతో ప్రయాణికులు నానా పాట్లు పడ్డారు. అత్యవసర పనుల మీద దూరప్రాంతాలకు వెళ్లవలసినవారు బిక్కమొహం వేశారు. బుధవారం ఎయిర్‌పోర్టుకు రావాల్సిన 22, ఇక్కడి నుంచి వెళ్లాల్సిన 20 విమానాలు రద్దు చేస్తున్నట్టు ఇండిగో సిబ్బంది ప్రకటించారు. ఢిల్లీ, హైదరాబాద్, ముంబై,గోవా, కోల్‌కతా, లక్నో తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ఇవే ప్రాంతాల నుండి రావాల్సినవి రాలేదు. అనేకమంది కౌంటర్‌లోని సిబ్బందిని నిలదీసినా జవాబు రాలేదు. సోషల్ మీడియాలో ఆక్రోశం వ్యక్తం చేశారు.
లాకప్‌డెత్.. సీఐ సస్పెండ్
బనశంకరి: రాజధానిలో వివేకనగర పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఓ యువకుని లాకప్‌డెత్ ఘటనలో సిఐ తో పాటు నలుగురు పోలీస్‌సిబ్బందిని కమిషనర్ సీమంత్‌కుమార్ సింగ్ సస్పెండ్ చేశారు. ఇటీవల ఓ గొడవలో దర్శన్ అనే యువకున్ని పోలీస్‌స్టేషన్ కు పిలిపించి సీఐ శివకుమార్, ముగ్గురు సిబ్బంది తీవ్రంగా కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రాణాపాయ స్థితిలోఉన్న దర్శన్ ను అడకమారనహళ్లి పునర్వసతి కేంద్రంలో ఉంచారు. అతను ఓ రోజు తరువాత చనిపోయాడు. దీంతో లాకప్‌డెత్ చేశారని అతని కుటుంబీకులు మాదనాయకనహళ్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారు. విచారణ జరిపిన ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.
స్నేహితుని ఇంటికే కన్నం
● బట్టల వ్యాపారి, మరొకరి అరెస్టు
● రూ.1.14 కోట్ల నగదు స్వాదీనం
బనశంకరి: స్నేహితుని ఇంటినే దోచుకున్న ఇద్దరిని బుధవారం హెబ్బగోడి పోలీసులు అరెస్ట్‌చేశారు. పోలీస్ కమిషనర్ సీమంత్‌కుమార్‌సింగ్ వివరాలను వెల్లడించారు. వివరాలు.. జిగణి హొబళి హులిమంగలలో అపార్టుమెంట్ నివాసి సునీల్‌కుమార్ బాధితుడు. గతనెల 8వ తేదీన కుటుంబంతో సొంతూరు కోలారు కు వెళ్లారు. అతని స్నేహితుడు, వస్త్రవ్యాపారి అయిన సుంకదకట్టె విఘ్నేశ్వరనగర శ్రీనివాసమూర్తి కి ఈ విషయం తెలిసింది. దీంతో ఎలక్ట్రీషియన్ చిక్కగొల్లరహట్టి అరుణ్‌కుమార్‌ను తీసుకుని ఇంటిలోకి చొరబడి భారీగా డబ్బు, బంగారాన్ని దోచుకున్నారు. ఫిర్యాదు మేరకు పోలీసులు గాలించి ఇద్దరినీ అరెస్టు చేశారు. వారి నుంచి రూ.93 లక్షలు నగదు, 16 గ్రాముల బంగారుచైన్, మారుతిసుజుకి 800 కారు, బట్టల షాపులో మరో రూ.7 లక్షల నగదు, బ్యాంకు ఖాతాలో రూ.7 లక్షల నగదు, స్నేహితుడికి ఇచ్చిన రూ.7 లక్షల నగదును పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. మొత్తం రూ.1 కోటి 14 లక్షల నగదు సీజ్ చేశారు. అప్పుల పాలై, యూట్యూబ్‌లో చూసి మొదటిసారిగా చోరీ చేసినట్లు నిందితులు తెలిపారు.
తేరుపై హనుమంతుడు


