అండర్‌పాస్‌లో రెండు బస్సుల ఢీ
● 12 మందికి గాయాలు
● ఊత్తంగేరి వద్ద ప్రమాదం
క్రిష్ణగిరి: బెంగళూరు నుంచి తిరువణ్ణామలై, తిరువణ్ణామలై నుంచి బెంగళూరుకు వెళుతున్న ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ప్రమాదంలో 12 మందికి గాయాలు తగిలాయి. మంగళవారం సాయంత్రం క్రిష్ణగిరి జిల్లా ఊత్తంగేరి సమీపంలోని సామలపట్టి రైల్వే బ్రిడ్జ్ అండర్‌పాస్ మార్గంలో రెండు బస్సులు ఢీకొన్నాయి. ధర్మపురి జిల్లా పాలక్కోడు ప్రాంతానికి చెందిన ఓ బస్సు డ్రైవర్ శ్రీనివాసన్ (48), ప్రయాణికులు సప్పానిపట్టివాసి మహాలింగం (29), తిరువణ్ణామలైవాసి పార్థిభన్ (35), చైన్నె కోయంబేడు ప్రాంతానికి చెందిన దివ్య (28), అరుళగిరిమంగలంకు చెందిన దేవి (24), సెంగంవాసి సోనా (30) సహా మరికొందరు గాయాల పాలయ్యారు. స్థానికులు గాయపడిన వారిని చికిత్స కోసం ఊత్తంగేరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సామలపట్టి పోలీసులు ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తరలించి ట్రాఫిక్‌ను సరిచేశారు. ఇరుకై న దారిలో రెండు బస్సుల డ్రైవర్లు నిర్లక్ష్యంగా బస్సులను నడపడం వల్లనే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపించారు.


